చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళల్లో మార్పు.. ఇవే..!

Chilukur Balaji temple visit timings change.తెలంగాణ తిరుప‌తిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆల‌యంలో స్వామి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2021 4:29 PM IST
చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళల్లో మార్పు.. ఇవే..!

తెలంగాణ తిరుప‌తిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆల‌యంలో స్వామి వారిని ద‌ర్శించునే వేళ్ల‌లో మార్పులు చేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు తిరిగి సాయంత్రం 4 గంట‌ల నుంచి 6 గంట‌ల‌కు వర‌కు స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి పూర్తిగా అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కు ఈ వేళ‌లే కొన‌సాగుతాయ‌న్నారు. కావునా.. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు ద‌ర్శ‌న స‌మ‌యాల్లో చేసిన మార్పుల‌ను గ‌మ‌నించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇక గూగుల్ లో ప్రస్తుతం చూపుతున్న స‌మ‌యాల‌ను అనుస‌రించ‌వ‌ద్ద‌ని కోరారు. సమయాల్లో తేడా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై గూగుల్‌ను సైతం అలర్ట్‌ చేసినప్పటికీ సమయాల్లో మార్పులు చేయలేదన్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా గూగుల్‌లో టైమింగ్స్‌ను అప్‌లోడ్ చేయాల‌ని రంగ‌రాజ‌న్ గూగుల్‌ను విజ్ఞ‌ప్తి చేశారు.

పురాణ కథనం..

ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి ఏడాది తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవాడు. కానీ అనారోగ్యకారణంగా ఆయన తిరుపతికి వెళ్లలేకపోతాడు. అందుకు చింతిస్తున్న ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీ సమీపంలోని అరణ్యంలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించగా.. పుట్టనుండి శ్రీదేవీ భూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించిగా.. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

ఇక్కడి ప్రత్యేక..

దేవుడి విగ్రహాన్ని కళ్లు మూసుకోకుండా చూడాలి. మొదటిసారి భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తారు. మ్రొక్కు తీరాక 108 ప్రదక్షిణాలు చేస్తారు.

హుండీ ఉండ‌దు..

ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి, ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉంది. దీనిని ప్రభుత్వం వారు 'యాదగిరి గుట్ట' దేవాలయానికి అనుసంధానం చేయాలనుకొన్నారు. అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధర్మకర్తలు దానిని వ్యతిరేకించారు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిెంచారు.ఈ ఆలయంలో 'హుండి' లేదు. గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారుల, ఊరి ప్రముఖుల ద్వారా జరుపబడుతుంది. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకుంది.

Next Story