ఈ నెల 12 నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు

Chilkur Balaji Temple's Brahmostsavam from April 12th.తెలంగాణ తిరుప‌తిగా.. వీసాల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2022 8:11 AM GMT
ఈ నెల 12 నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు

తెలంగాణ తిరుప‌తిగా.. వీసాల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారం చేసే స్వామిగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆల‌యం బ్ర‌హ్మోత్స‌వాల‌కు ముస్తాబైంది. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రీరామ‌న‌వ‌మి త‌రువాత ద‌శ‌మి నుంచి బ్ర‌హోత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ సారి ఈ నెల 12 నుంచి బ్ర‌హోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలు బ్ర‌హోత్స‌వాల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేదు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12న నుంచి 18 వ‌ర‌కు భక్తులు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు.

ఏ రోజున ఏ సేవ అంటే..

- 12న ధ్వజారోహణం, శేషవాహనం

- 13న గోప వాహనం, హనుమంత వాహనం

- 14న సూర్యప్రభ, గరుడ వాహనం రాత్రికి స్వామివారి కల్యాణోత్సవం

- 15న వసంతోత్సవం, గజ వాహనం

- 16న స్వామివారి పల్లకీ సేవా, రాత్రికి రథోత్సవం

- 17న‌ మహాభిషేకం, అశ్వ వాహనం, దోప్‌ సేవ, పుష్పాంజలి

- 18న ధ్వ‌జారోహ‌ణం, ద్వాద‌శ‌రాధ‌నం నిర్వ‌హించిన అనంత‌రం చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.

గరుడ ప్రసాదం.. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు

బ్రహ్మోత్పవాల్లో ప్రధాన ఘటమైన ద్వజారోహణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తారు. ఈ నెల 12న ఉదయం ద్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున ఆలయ గర్భ గుడి ఎదుట ఉన్న ద్వజ స్తంభంపై గరుడ పతాకాన్ని ఆరోహణం చేస్తారు. గరుడ్మంతుడికి విగ్ర‌హానికి అభిషేకం చేస్తారు. గరుత్మంతుని ఆరాధన, అలంకారం తర్వాత ద్వజారోహణం సమయంలో నాలుగు దిక్కుల ఉన్న గరుత్మంతుల వారికి పొంగలి నైవేద్యంగా సమర్పంచుకుంటారు. దీన్ని గరుడపిండం అని లేదంటే గరుత్మంతుని నైవేద్యంగా పిలుస్తారు. అయితే ఈ గరుత్మంతుని నైవేద్యాన్ని సంతానం కావాలని కోరుకునే మహిళలు తీసుకుంటే సంతానవతి అవుతుందని ఆగమ శ్లోకంలో ఉంది. ఉండటమే కాదు చిలుకూరు బాలాజీ ఆలయంలో గత కొన్నేళ్లుగా ఈ క్రతువు నిర్వహిస్తున్న సమయంలో గురుత్మంతుని నైవేద్యాన్ని స్వీకరించిన మహిళలు గర్భం దాల్చినట్లుగా స్వయంగా వాళ్లే వచ్చి ఈ ఆలయ అర్చకులతో చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఆలయ ప్రత్యేకత..

చిలుకూరు బాలాజీ దేవాలయంలో స్వామివారి దర్శనానికి ఒకే మార్గం. దైవదర్శనానికి ఎలాంటి టికెట్లు లేవు. ప్రత్యేక వీఐపీ క్యూలైన్లు లేవు. స్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇక్కడ హుండీ లేదు. అనతికాలంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో కొలువుదీరిన బాలాజీని భక్తజనం ఆపదల మొక్కుల వాడిని వీసాల దేవుడని పిలుచుకుంటారు. మనసులోని కోరికలను స్వామికి సమర్పించుకునే ముందు 11 ప్రదక్షణలు, మొక్కు తీరాక 108 ప్రదక్షణలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామి వారికి చెల్లించుకున్న మొక్కులు నెరవేరడంతో భక్తులు చిలుకూరి వేంకటేశ్వరస్వామికి వీసాల దేవుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తిరుపతిగా భక్తులే నామకరం చేసుకున్నారు. దీంతో ఆలయం దేశంలోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాచూర్యం పొందింది.

Next Story