హైదరాబాద్‌లోని మల్లాపూర్ పరిధిలో ఉన్న బాబా నగర్ కాలనీలోని 'తవక్కల్ చికెన్ అండ్ మటన్ మార్కెట్' బయట వెలిసిన ఒక బ్యానర్ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ఉన్న ఈ నోటీసులో, చికెన్ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఏప్రిల్ 1 నుంచి నిరవధికంగా షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
పౌల్ట్రీ కంపెనీల తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించడమే కాకుండా, తమపై ఆధిపత్యం చలాయిస్తున్నాయని వారు ఆరోపించారు. లాభాలు లేనిదే వ్యాపారం కొనసాగించడం అసాధ్యమని, అందుకే ఈ నిరసన బాట పట్టినట్లు వారు పేర్కొన్నారు. తగ్గించిన మార్జిన్‌ను సరిచేసే వరకు ఈ బంద్ కొనసాగుతుందని, ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చికెన్ వ్యాపారులు ఇదే బాటలో నడుస్తుండటంతో, రానున్న రోజుల్లో చికెన్ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. కంపెనీల మొండివైఖరి నశించాలని, చిన్న వ్యాపారులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.