కస్తూర్బా కాలేజీ ల్యాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 36 మందికి అస్వస్థత

Chemical gas leak in Kasturba College, Secunderabad.. students fell ill. హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా గాంధీ కాలేజీలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది.

By అంజి  Published on  18 Nov 2022 4:44 PM IST
కస్తూర్బా కాలేజీ ల్యాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 36 మందికి అస్వస్థత

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని కస్తూర్బా గాంధీ కాలేజీలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. కెమికల్‌ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ లీకేజీ కావడంతో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని వెంటనే దగ్గర్లోని గీతా నర్సింగ్‌ హోమ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఘటన జరగడంతో పలువురు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలేజీలోని ఇంటర్‌ బ్లాక్‌లో గల కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థులు ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్‌ లీకైంది. దీంతో 36 మంది విద్యార్థులు ఆ విషవాయువులు పీల్చి స్పృహతప్పి పడిపోయారు. కాలేజీ సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరో వైపు తమ పిల్లల పరిస్థితిని తెలుసుకోడానికి తల్లిదండ్రులకు ఆస్పత్రికి వచ్చారు. కళాశాల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కెమిస్ట్రీ ల్యాబ్‌లో రసాయనాలను అధికంగా వాడడం ఈ ఘటనకు దారితీసింది. గ్యాస్ రూపంలో ఉన్న రసాయనం కాలేజీలోని 2,3, 4వ అంతస్తులకు వ్యాపించింది. 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొద్దిమంది వాంతులు, స్పృహ తప్పి పడిపోయారు. 16 మంది విద్యార్థులను ఐసియులో చేర్చారు.


Next Story