ఎర్రచందనంపై సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి పుస్తకం.. అవిష్కరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
Cheif Justice NV Ramana Launches Red Sanders Book. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై రాసిన
By Medi Samrat Published on 15 Dec 2021 2:51 PM GMTసీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై రాసిన పరిశోధనాత్మక పుస్తకం 'బ్లడ్ సాండర్స్' బుధవారం విడుదలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'బ్లడ్ సాండర్స్' పుస్తకం వెనక సుధాకర్ రెడ్డి పరిశోధన, కృషి ఎంతో ఉందని కొనియాడారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ న్యూస్ రిపోర్టర్‌గా ఆయన ఈ విషయాన్ని ట్రాక్ చేస్తున్నారు. నడవడానికి కష్టతరమైన అడవిలో.. ఎర్రచందనం దాచే ప్రదేశాలలో ఆయన విస్తృతంగా ప్రయాణించారు. స్మగ్లింగ్ రాకెట్ నడిపే వ్యక్తులతో, వారికి అడ్డుకట్ట వేసే అధికారులతో ఆయన ప్రత్యక్షంగా సంభాషించాడు. ఈ పుస్తకం రాయడానికి అత్యంత అర్హత కలిగిన వ్యక్తి సుధాకర్ రెడ్డి అని నేను అనుకుంటున్నానని ఎన్వీ రమణ అన్నారు.
పుస్తక అవిష్కరణ కోసం సుధాకర్ రెడ్డి మొదట నన్ను సంప్రదించినప్పుడు.. అవును అని చెప్పడం తప్ప నాకు వేరే మార్గం లేదు. కారణం.. అతను జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ల నుండి నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఎడిటర్ స్థాయికి ఎదిగినందుకు నేను సంతోషిస్తున్నానని ఎన్వీ రమణ అన్నారు. SVVNలో విద్యార్థులుగా ఉన్నప్పటి నుండి సుధాకర్ రెడ్డి కుటుంబంతో పరిచయం ఉందన్న ఎన్వీ రమణ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా.. మా ఊరూ వాడా గుర్తొస్తొన్నాయి. ఆ మంచి రోజులూ, ఆనాటి మిత్రులు గుర్తుకొస్తున్నారు. ఊరికి వెళ్లాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. త్వరలో వీలు చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అని సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల మీదుగా దశాబ్దాల క్రితం వరకు ఎర్రచందనం వృద్ధి చెందింది. ఇప్పుడు అంతరించిపోవడం ద్వారా ముప్పును ఎదుర్కొంటుంది. ఈ ప్రపంచంలోని అన్ని మంచి విషయాల మాదిరిగానే.. మనిషి దురాశకు రెడ్ సాండర్స్ కూడా బలైందని అన్నారు. శక్తివంతులు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎలా ఆజ్యం పోశారనేది సుధాకర్ రెడ్డి ఈ పుస్తకంలో వివరిస్తున్నారని ఆయన అన్నారు. ఎర్ర చందనం మాత్రమే కాదు, పర్యావరణ వ్యవస్థ మొత్తం విధ్వంసానికి గురవుతున్న పరిణామాలు మనం చూస్తున్నామని.. ఈ సమస్యలను స్థానికంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.