ప్రముఖ సినీ నటి మాధవీలతపై హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందింది. మాధవీలతతో పాటు ఈ వివాదాన్ని ప్రోత్సహించిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
మాధవీలత ఇటీవల సాయిబాబాను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల నమ్మకాలను కించపరిచేలా ఉన్నాయని కొందరు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, మాధవీలతతో పాటు ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి, వీడియోలు ప్రచారం చేసిన వారిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు.