Hyderabad: మద్యం మత్తులో కారుతో పోలీసు బీభత్సం

పోలీసు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఆ తర్వాత నానా హంగామా సృష్టించాడు.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2023 12:00 PM IST
Car Accident, Hyderabad , Police, Drunk drive,

Hyderabad: మద్యం మత్తులో కారుతో పోలీసు బీభత్సం

మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు, ప్రభుత్వ అధికారులు పదే పదే చెబుతుంటారు. రూల్స్ పాటించాలని.. సేఫ్‌గా ఉండాలని సూచిస్తారు. కానీ.. అదే పోలీసు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఆ తర్వాత నానా హంగామా సృష్టించాడు. హైదరాబాద్‌లో జరిగింది ఈ సంఘటన

బొల్లారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఏసీపీ శ్రీనివాస్‌ రాజీవ్‌ రహదారిపైకి ఫుల్లుగా మద్యం సేవించి కారులో వచ్చాడు. కారుని అత్యంత వేగంగా నడుపుతూ వచ్చాడు. అదే రూట్‌లో బోయిన్‌పల్లి మార్కెట్‌కు కూరగాయల లోడ్‌తో ఒక వాహనం వెళ్తుంది. మద్యం మత్తులో ఏవీ చూసుకోని పోలీసు అధికారులు కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. వేగంగా ఉండటంతో కూరగాయల లోడ్‌తో వెళ్తున్న డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ శ్రీధర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే.. శ్రీధర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వైద్యులు.

యాక్సిడెంట్ చేసిన పోలీసు అధికారి మద్యం సేవించి ఉన్నట్లు ఇతర పోలీసు అధికారులు గుర్తించారు. దాంతో.. అతడికి బ్రీత్‌ అనలైజ్ చేయగా 200కు పైగా పాయింట్లు చూపించినట్లు తెలుస్తోంది. అంతగా మద్యం సేవించి రోడ్డుమీదకు రావడంతో అధికారులే షాక్‌కు గురయ్యారని సమాచారం. కాగా.. రోడ్డుప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం ధ్వంసం అయ్యింది. కారుకి జరిగిన డ్యామేజ్ చూసి ప్రమాద తీవ్రతను స్థానికులు, పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రోడ్డుప్రమాదం చేసిన సదురు పోలీస్ అధికారి వాహనంపై ఇప్పటికే ఆరు ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story