హైదరాబాద్‌ వాసులకు అలర్ట్..ట్యాంక్‌బండ్‌పై కేక్‌ కటింగ్స్‌ బ్యాన్

GHMC అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాంక్‌ బండ్‌పై కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

By Srikanth Gundamalla  Published on  7 Nov 2023 11:47 AM GMT
cake cutting, ban,  hyderabad, tank bund, ghmc,

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్..ట్యాంక్‌బండ్‌పై కేక్‌ కటింగ్స్‌ బ్యాన్ 

హైదరాబాద్‌లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి ట్యాంక్‌ బండ్. హేస్సేన్‌ సాగర్‌ ఒడ్డున రోడ్డు.. అక్కడే కొత్తగా నిర్మించిన సచివాలయం.. అంతేకాదు పార్క్‌లు... అంబేద్కర్‌ విగ్రహం ఇలా చాలా ఉన్నాయి. దాంతో.. ట్యాంక్‌బండ్‌ చూడ్డానికి చాలా మంది వస్తుంటారు. హైదరాబాదీలు అయితే సాయంత్రం వేళ ఇక్కడ వచ్చి సేదతీరుతూ ఉంటారు. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ అందాలను తిలకిస్తూ.. చుట్టూ వాహనాల మోత ఉన్నా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాధిస్తుంటారు. హుస్సేన్ సాగర్ సాక్షిగా ఎంతో మంది యువత ప్రేమికులుగా మారిన సందర్భాలూ ఉన్నాయి.

ఇక్కడ అర్ధరాత్రి వరకు ఎంతో రద్దీ ఉంటుందనే చెప్పాలి. స్నేహితులు.. కుటుంబ సభ్యులు, ప్రియమైన వారి పుట్టిన రోజులను జరుపుతుంటారు. మర్చిపోలేని జ్ఞాపకాలను రాసుకుంటారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో అర్థరాత్రి సమయంలో కేక్ కట్ చేయించి.. అద్భుతమైన అనుభూతిని పంచుకుంటూ ఉంటారు. అనుభూతులు పక్కకి పెడితే.. రోజూ ఇక్కడికి బర్త్‌డే సెలబ్రేషన్‌ అంటూ వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో.. కేక్స్‌ కట్‌ చేయించి.. ఇతర వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్తున్నారు. దాంతో.. ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత మేర చెత్త పేరుకుంటుంటే.. అర్ధరాత్రి 11 నుంచి 12.30 గంటల లోపు చేరుకునే చెత్త అధికం అవుతోంది.

కేక్ కట్ చేయిస్తూ.. ఆ కేక్‌ను ఇష్టమొచ్చినట్టు ముఖాలకు పూసుకుంటూ.. రోడ్డుపై వెదజల్లుతూ ఈలలు గోలలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. కొన్నిసార్లు రోడ్లకు అడ్డంగా వాహనాలను నిలిపేసి.. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. ఫలితంగా కొన్నిసార్లు గొడవలు కూడా జరుగుతుంటాయి. దీంతో.. అటు అక్కడి పరిసరాలు పాడవటంతో పాటు న్యూసెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఇలాంటి వాటి మీద చాలా మంది అటు పోలీసులకు ఇటు బీహెచ్‌ఎంసీ అధికారులకు కూడా ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాంక్‌ బండ్‌పై కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఒక వేళ ఎవరైనా కేక్‌ కటింగ్స్‌ చేసి.. చెత్తాచెదారం జల్లితే జరిమానాలు విధించనట్లు ప్రకటించారు. సీసీ కెమెరాలు ఉంటాయని..ఈ విషయంలో అందరూ సహకరించాలని కోరారు. అంతేకాదు.. అక్కడక్కడ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నోటీసు బోర్డులను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

Next Story