Video: బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ ఛేంజ్.. నివ్వెరపోయిన హైదరాబాద్ పోలీసులు
ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి చలానాల నుంచి తప్పించుకోవడానికి ఒక విలాసవంతమైన కారు యజమాని చేసిన 'మ్యాజిక్' ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
By - అంజి |
Video: బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ ఛేంజ్.. నివ్వెరపోయిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి చలానాల నుంచి తప్పించుకోవడానికి ఒక విలాసవంతమైన కారు యజమాని చేసిన 'మ్యాజిక్' ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వద్ద శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్‌కు చెందిన గౌతమ్ అనే వ్యక్తి తన బీఎండబ్ల్యూ (BMW) కారులో నంబర్ ప్లేట్‌ను మార్చుకునేలా ఒక ప్రత్యేకమైన సాంకేతికతను ఏర్పాటు చేసుకున్నాడు. డ్రైవింగ్ సీటు పక్కన ఉండే ఒక బటన్ నొక్కగానే అసలు నంబర్ ప్లేట్ స్థానంలో నకిలీ నంబర్ ప్లేట్ ప్రత్యక్షమవుతుంది.
తనిఖీల్లో భాగంగా కారును ఆపిన పోలీసులు, గౌతమ్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా 137 ఎంజీ (BAC) మద్యం తాగినట్లు తేలింది. మద్యం మత్తులో ఉన్న గౌతమ్ పోలీసులకు తన వివరాలు చెప్పడానికి నిరాకరించాడు. దీంతో వాహనాన్ని పక్కకు పార్క్ చేసే క్రమంలో ఒక కానిస్టేబుల్ అనుకోకుండా స్టీరింగ్ పక్కన ఉన్న బటన్‌ను నొక్కాడు. దీంతో కారు ముందు భాగంలో ఉన్న నంబర్ ప్లేట్ ఒక్కసారిగా మారిపోయింది. కారు ముందు వైపు 'DL 6 CM 7079' అని ఉండగా, వెనుక వైపు 'TSFQ 9999' అని ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
#Hyderabad: During a #drunkdriving check in #JubileeHills, #police caught a man using a #hightech trick to evade #challans. His #car was fitted with a system that could change number plates. With just a button press, the car could switch between #Delhi and #Telangana… pic.twitter.com/U5VsKLcv8w
— NewsMeter (@NewsMeter_In) April 12, 2026
పోలీసులు కారు చాసిస్, ఇంజిన్ నంబర్లను తనిఖీ చేయగా, దాని అసలు నంబర్ 'DL 6 CM 7079' అని తేలింది. ట్రాఫిక్ నిబంధనల నుంచి, చలానాల నుంచి తప్పించుకోవడానికే తాను ఈ ఏర్పాటు చేసుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ అసాధారణ మోసాన్ని గుర్తించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కారును సీజ్ చేసి, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు.