సీన్ రివర్స్ : కట్నం సరిపోలేదని పెళ్లి వద్దన్న వధువు.. షాక్‌లో వరుడు.. కొసమెరుపు ఏమిటంటే..?
కట్నం తక్కువైందని వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 8:35 AM ISTప్రతీకాత్మక చిత్రం
మామూలుగా అయితే కట్నం ఇవ్వలేదని, లేకుంటే అదనపు కట్నం కావాలని వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిళ్లు ఆపిన ఘటనలు చూశాం. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లి కొడుకు ఇచ్చిన కట్నం తక్కువైందని ముహూర్త సమయానికి సరిగ్గా గంట ముందు వధువు పెళ్లికి నిరాకరించింది. వరుడు తరుపు వారు ఎంత సర్దిచెప్పాలని చూసిన లాభం లేకపోయింది. పెళ్లి చేసుకునేది లేదని వధువు తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక వరుడు తరుపు వారు ఊసురు మంటూ పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ యువతితో పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వధువుకి వరుడు తరుపు వారు రూ.2లక్షలు కట్నం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. గురువారం రాత్రి 7.21 గంటల పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
ముహూర్తానికి సమయం దగ్గర పడుతుండడంతో పెళ్లి కొడుకు, అతడి బంధువులు గురువారం మధ్యాహ్నమే కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అయితే.. ఎంత సేపటికి వధువుతో పాటు ఆమె తరుపు వారు కళ్యాణ మండపానికి రాకపోవడంతో వారిలో టెన్షన్ మొదలైంది. ముహూర్త సమయం ముంచుకు వస్తుండడంతో ఏం జరిగిందని వరుడు తరుపు వారు ఆరా తీయగా విషయం తెలిసి కంగుతిన్నారు.
రూ.2లక్షల కట్నం సరిపోదని, ఇంకా అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని లేకుంటే లేదని వధువు తేల్చి చెప్పింది. విషయం విన్న వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురి అయ్యారు. ముహూర్త సమయానికి సరిగ్గా గంట ముందు వధువు విషయం చెప్పడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. వరుడి తరుపు వారు నచ్చజెప్పాలని చూసినా లాభం లేకపోయింది. చేసేది లేక వరుడు తరుపు వారు పోలీసులను ఆశ్రయించారు.
యువతి తరుపు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడిన ఫలితం లేకపోయింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. వధువుకు ఇచ్చిన రూ.2లక్షల కట్నాన్ని కూడా వరుడు వదులుకోవడం ఇక్కడ కొసమెరుపు.