సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి బోనాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రాష్ట్ర పండుగ లష్కర్ బోనాలు జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి
By అంజి Published on 9 May 2023 6:45 AM GMTసికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి బోనాలకు ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రాష్ట్ర పండుగ లష్కర్ బోనాలు జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాంప్రదాయం ప్రకారం, బోనాలు ఆషాడ మాసం మొదటి ఆదివారం నాడు ప్రారంభమవుతాయి (జూన్ 25న ప్రారంభమై జూలై 16 వరకు కొనసాగుతాయి). ఉత్సవాలు మొదట గోల్కొండ ప్రాంతంలో, తరువాత సికింద్రాబాద్‌లో, తరువాత నగరంలోని మిగిలిన ప్రాంతాలలో జరుగుతాయి.
సోమవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. జూలై 10న ఆలయంలో రంగం వార్షిక క్రతువు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై త్వరలో అన్ని ప్రభుత్వ సంస్థల అధికారులు, ఉజ్జయిని మహంకాళి ఆలయ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు.
"అంతేకాకుండా, ఆలయ పరిసరాల్లో రోడ్ల పునరుద్ధరణ, డ్రైనేజీకి సంబంధించిన పనులు సహా అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి" అని మంత్రి చెప్పారు. ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు, నిరంతర విద్యుత్, నీటి సరఫరా ఉండేలా చూడాలని, ఆలయానికి వెళ్లే రహదారులను తీర్చిదిద్దాలని తలసాని అధికారులను కోరారు.