హవాలా మార్గంలో బోయిన్‌పల్లి అభిషేక్‌రావు నగదు బదిలీ : సీబీఐ
Boinpally Abhishek Rao transferred money through hawala channels: CBI.ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టైన
By తోట వంశీ కుమార్ Published on 12 Oct 2022 2:48 AM GMTహైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టైన హైదరాబాద్ వ్యాపారి బోయిన్ పల్లి అభిషేక్ రావు వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీసే దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ముందుకు సాగుతోంది. అభిషేక్ బ్యాంకు ఖాతాలు పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనకు, దాని ద్వారా లబ్ధి పొందేందుకు నిందితులు, మద్యం వ్యాపారులతో అభిషేక్ పలు మార్లు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో సమావేశం అయినట్లు వెల్లడైంది.
అక్టోబర్ 9న సీబీఐ అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో అభిషేక్ ఉన్నాడు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేసిన రెండో నిందితుడు ఇతడు.
లిక్కర్ పాలసీ అమల్లోకి రాకముందే ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌నాయర్‌కు మరో నిందితుడు దినేష్ అరోరా ద్వారా హవాలా మార్గంలో నవంబర్ 2021 నుంచి జులై 2022 వరకు డబ్బు పంపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఇంకో నిందితుడిగా ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థకు చెందిన సమీర్ మహేంద్రు బదిలీ చేసిన డబ్బు కూడా చివరకు అభిషేక్ ఖాతాలో చేరింది. ఈ నగదు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు అభిషేక్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదని సీబీఐ తెలిపింది.
ఈ కేసు ప్రారంభంలో అభిషేక్‌కు CrPC సెక్షన్ 160 కింద నోటీసులు అందజేయబడ్డాయి. అతడు విచారణకు హాజరయ్యాడు. కుట్రలో అతని పాత్ర బయటపడినప్పుడు CrPC సెక్షన్ 41(A) కింద నోటీసులు అందజేయబడ్డాయి. పలుమార్లు సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారించాం. ఆధారాలు అతడి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ జవాబులు చెప్పేందుకు తడబడ్డారు. పాతవిషయాలను గుర్తు చేసుకునేందుకు కొంత సమయం కోరారు.
సమయం ఇచ్చినా, అతడు దర్యాప్తుకు సహకరించలేదు. నిజాలు దాస్తున్నాడు. హవాలా ద్వారా తాను పంపిన నగదు గురించి, కుట్రతో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి చెప్పడం లేదు.అందుకనే అతడిని అక్టోబర్ 9న అరెస్ట్ చేసినట్లు సీబీఐ చెప్పింది.