హైదరాబాద్ నగరం బిర్యానీకి పెట్టింది పేరు. హైదాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటారు. ఇక వారంతపు సెలవుల్లో బిర్యానీ సెంటర్లలో జనాలు బారులు తీరుతుంటారు. అయితే మంచి బిర్యానీ కోసం భాగ్యనగర వాసులు ఎక్కడికైనా వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. దూరంతో లెక్క లేకుండా బిర్యానీని తినేందుకు ఆసక్తి చూపే వారు ఎక్కువగా ఉంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ఆరగించే బిర్యానీ.. పెద్ద హోటళ్లలో లభిస్తున్నప్పటికీ సామాన్యులు తినాలంటే మాత్రం ఖర్చుతో కూడుకున్నది. కానీ హైదరాబాద్‌లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ.60లకే లభిస్తుంది. అది ఎక్కడో కాదు.. ఉప్పల్ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో 'తిన్నంత బిర్యానీ' పాయింట్‌లో రుచికరమైన బిర్యానీ లభిస్తుంది.
ఉదయ్, కిరణ్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి స్టార్టప్‌గా 'తిన్నంత బిర్యానీ' పేరుతో ప్రారంభించారు. బిర్యానీతో పాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తున్నామని వారు చెబుతున్నారు. ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. అయితే తిన్నంత బిర్యానీ పెడతామని వెల్లడించారు. ఇటీవలె బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో ఆదరణ పెరుగుతోందని ఉదయ్, కిరణ్ చెబుతున్నారు. అయితే తక్కువ ధర ఉందని.. బిర్యానీ నాసిరకం ఉంటుందని అనుకునేరు. అలాంటిదేమి లేదు. బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు పెట్టుబడి పెడుతున్నామని, రోజు ఎంతో రద్దీగా ఉండే ఉప్పల్-రామంతపూర్ రహదారిలో రూ.60 చెల్లించి 'తిన్నంత బియ్యానీ' పాయింట్ బిర్యానీ తింటున్నామని, అంతేకాకుండా చాలా రుచిగా ఉందని బిర్యానీ ప్రియులు చెబుతున్నారు.