ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు సరికదా.. చలాన్లు కట్టడం లేదు. దీంతో పోలీసులు భాగ్యనగరం హైదరాబాద్‌లో వాహన తనిఖీలు చేస్తూనే.. పెండింగ్ చలానులు ఉంటే..ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ ద్విచక్రవాహానాన్ని ఆపి చెక్ చేయగా.. ఆ వాహానంపై 179 చలానులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సదరు వాహనదారుడు చలానాలు కట్టే బదులు కొత్త వాహానాన్ని కొనుక్కోవచ్చు అంటూ.. బైక్‌ను వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
సోమవారం రాత్రి అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలోని కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ బైక్‌ను ఆపారు. చలాన్లు ఉన్నాయో లేవో అని చెక్ చేయగా.. ఆ వాహనం పై 179 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. చలాన్లు విలువ రూ.42,475 గా ఉంది. అంత పెద్ద మొత్తం జరిమానా చెల్లించలేక బైక్‌ను వదిలి సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారు అయ్యాడు. పోలీసులు బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.