ఇటీవ‌ల అవార్డులు పొందిన వారిని స‌న్మానించిన గవర్నర్ దత్తాత్రేయ

Bandaru Dattatreya Meet Awardees At Raj Bhavan. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రాజ్ భవన్ వేదిక‌గా ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వంచే అవార్డులు పొందిన వారిని క‌లిశారు.

By Medi Samrat  Published on  31 Jan 2021 8:58 AM GMT
Bandaru Dattatreya Meet Awardees At Raj Bhavan
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రాజ్ భవన్ వేదిక‌గా ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వంచే అవార్డులు పొందిన వారిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గిరిజన కళాకారుడు కనకరాజు, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, కల్నల్ కృష్ణ మోహన్ ల‌ను స‌న్మానించారు. వివిధ రంగాల్లో వారు చేసిన విశేష సేవ‌ల‌ను గుర్తించి అవార్డులు అందజేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.


ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యుడు, మారుమూల గిరిజన కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేసారు. గిరిజనులకే ప్రత్యేకమైనటువంటి నృత్య ప్రదర్శన ఐన "గుస్సాడీ " నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజు ఈ అవార్డు కి అన్నివిధాలా అర్హుడని దత్తాత్రేయ అన్నారు. అతి సామాన్యుడైన గోండు గిరిజనుడిని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించి పద్మ శ్రీ అవార్డు ఇవ్వడం చాల గొప్పవిషయమని దత్తాత్రేయ చెప్పారు. కనకరాజుకు పద్మ శ్రీ అవార్డు రావ‌డం తెలంగాణ లోని గిరిజనులకు, వారి సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపు అని దత్తాత్రేయ అభివర్ణించారు.

కల్నల్ సంతోష్ బాబు మాతృభూమికి కోసం వీరమరణం పొందాడని, ఆయన త్యాగం వృధాగా పోదని దత్తాత్రేయ అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు ఇవ్వడం పట్ల దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా సంతోష్ సతీమణి సంతోషిని దత్తాత్రేయ అభినందించారు. సంతోష్ బాబు త్యాగం, పరాక్రమం తోటి సైనికులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

కల్నల్ కృష్ణ మోహన్ కు కేంద్ర ప్రభుత్వ విశిష్ట సేవ మెడల్ రావడం పట్ల దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేసారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వారు విశేష సేవలు అందించారని దత్తాత్రేయ అన్నారు. అలాగే సైనికులకు శిక్షణ ఇవ్వడం లో కూడా ఆయ‌న‌ గొప్ప ప్రతిభ చూపారని దత్తాత్త్రేయ పేర్కొన్నారు.


Next Story