వేలంపాట‌లో రికార్డు ధ‌ర ప‌లికిన బాలాపూర్ ల‌డ్డూ.. ఎంతంటే..?

Balapur Ganesh laddu likely to fetch Rs 19 lakh this year.బాలాపూర్ గ‌ణ‌ప‌తి లడ్డూ ప్రసాదానికి చాలా క్రేజ్‌ ఉంది. ఈ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2021 5:05 AM GMT
వేలంపాట‌లో రికార్డు ధ‌ర ప‌లికిన బాలాపూర్ ల‌డ్డూ.. ఎంతంటే..?

బాలాపూర్ గ‌ణ‌ప‌తి లడ్డూ ప్రసాదానికి చాలా క్రేజ్‌ ఉంది. ఈ లడ్డూను దక్కించుకుంటే తమకు తిరుగుండదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గణనాధుడి లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు. 1994 నుంచి బాలాపూర్ గ‌ణ‌ప‌తి ల‌డ్డూ వేలం పాట ప్రారంభ‌మైంది. ప్ర‌తి ఏటా స‌రికొత్త రికార్డులు న‌మోదు అవుతున్నాయి. ఇక అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన బాలాపూర్ ల‌డ్డూ వేలం పాట ముగిసింది. ఈ సారి కూడా బాలాపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర ప‌లికింది. వేలం పాట‌లో ల‌డ్డూను రూ.18.90లక్ష‌ల‌కు వేలం పాడారు.

ఈ ఉద‌యం ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఆఖరిపూజ పూర్తిచేసుకున్న లంబోదరుడు భజనబృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ.. బాలాపూర్‌ ప్రధాన వీధుల్లో ఉరేగాడు. బాలాపూర్‌ ముఖ్య కూడలికి చేరుకున్న అనంత‌రం ల‌డ్డూ వేలం పాటను నిర్వ‌హించారు. మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్‌ ఈసారి వేలంలో లడ్డూని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. కాగా.. గతేడాది కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాటను రద్దు చేశారు. 2019లో బాలాపూర్ లడ్డూ.. రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది.

Next Story