బాలాపూర్ ల‌డ్డూకు రికార్డు ధ‌ర‌.. ఎంతంటే..?

Balapur Ganesh laddu auctioned for Rs 24.6 lakh.భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sept 2022 11:04 AM IST
బాలాపూర్ ల‌డ్డూకు రికార్డు ధ‌ర‌.. ఎంతంటే..?

భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీపడుతుంటారు. వందలూ, వేలూ కాదు లక్షల్లో ధ‌ర‌ పలుకుతుంది. బాలాపూర్‌ లడ్డూ.. పాత రికార్డులను తిరగరాస్తూ ఈ సారి రికార్డు స్థాయి ధ‌ర ప‌లికింది. రూ.24.60ల‌క్ష‌ల‌కు వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ ల‌డ్డూని ద‌క్కించుకున్నారు. గతేడాది కంటే రూ.5.70లక్షలు ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం.

గ‌త 29 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్ గ‌ణేష్ ల‌డ్డూ వేలం కొన‌సాగుతోంది. ఈ సారి కూడా పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం రూ.రూ.1,11,116 నుంచి నిర్వ‌హ‌కులు వేలం పాట ప్రారంభించారు. 28 మంది వేలం పాట‌లో పాల్గొన‌గా.. చివ‌రికి వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

బాలాపూర్ ల‌డ్డూ సంప్ర‌దాయం 1980లో ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ 1994 నుంచి వేలం పాట నిర్వ‌హిస్తున్నారు. తొలి ఏడాది రూ.450తో మొదలైన లడ్డూ వేలం పాట నేడు రూ.లక్షల్లో ప‌లుకుతోంది. బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటే గణేశుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడరు.

ఇప్ప‌టి వ‌ర‌కు బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న వారు..

1994లో కొలను మోహన్‌రెడ్డి రూ. 450

1995లో కొలను మోహన్‌రెడ్డి రూ. 4,500

1996లో కొలను కృష్ణా రెడ్డి రూ. 18 వేలు

1997లో కొలను కృష్ణా రెడ్డి రూ. 28వేలు

1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51 వేలు

1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65 వేలు

2000లో కల్లెం అంజిరెడ్డి రూ. 66 వేలు

2001లో జి.రఘునందన రెడ్డి రూ. 85 వేలు

2002లో కందాడ మాదవ్ రెడ్డి రూ.లక్షా 5వేలు

2003లో చిగిరింత బాల్ రెడ్డి రూ. లక్షా , 55వేలు

2004లో కొలను మోహన్‌రెడ్డి రూ. 2 లక్షల ఒక వేయి

2005లో ఇబ్రహిం శేఖర్ రూ. 2లక్షల, 8వేలు

2006లో చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు

2007లో జి.రఘునందనాచారి రూ. 4 లక్షల 15వేలు

2008లో కొలను మోహన్‌రెడ్డి రూ. 5లక్షల 7వేలు

2009లో సరిత రూ. 5లక్షల 10వేలు

2010లో శ్రీధర్‌బాబు రూ. 5 లక్షల 35వేలు

2011లో కొలను ఫ్యామిలీ రూ. 5 లక్షల 45 వేలు

2012లో పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7 లక్షల,50 వేలు

2013లో తీగల కృష్ణారెడ్డి రూ. 9 లక్షల 26 వేలు

2014లో సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రూ. 9 లక్షల 50 వేలు

2015లో కళ్లెం మదన్‌మోహన్‌ రూ. 10 లక్షల 32వేలు

2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14లక్షల 65వేలు

2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల 60 వేలు

2018లో శ్రీనివాస్ గుప్తా రూ.16లక్షల 60 వేలు

2019లో కొలను రాంరెడ్డి రూ.17 లక్షల 60 వేలు

2020లో కరోనా కారణంగా వేలం జరగలేదు.

2021లో మర్రి శశాంక్‌ రెడ్డి రూ.18 లక్షల 90 వేలు

2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 ల‌క్ష‌ల 60వేలు

Next Story