భాగ్యనగరంలో ఆషాఢమాసం బోనాలు ప్రారంభం
Ashada Masam Bonalu Festival Starts From Today.హైదరాబాద్ నగరంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు
By తోట వంశీ కుమార్ Published on 11 July 2021 5:33 AM GMTహైదరాబాద్ నగరంలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలైంది. జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. ఈ రోజు నుంచి వచ్చేనెల 8 వరకు బోనాలు జాతర జరుగనుంది. బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లను విడుదల చేసింది. గతేడాది కరోనా కారణంగా సందడి లేకుండానే బోనాల ఉత్సవాలు సాగాయి. ఈ సారి ధూమ్ ధామ్‌గా బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.
నాలుగు శతాబ్దాలుగా నగరంలోని అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగకు నగరం మరోసారి సర్వసన్నద్ధమైంది. ఈ నెల 13 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగనుంది. జూలై 25 , 26న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారి బోనాలు, ఆగస్టు 1, 2న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహా వాహిని మహాంకాళీ అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు. నేడు గోల్కొండలో మొదలై ఆగస్టు 8న గోల్కొండలోనే బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
ఇదిలాఉంటే.. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక గా నిలుస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో.. తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.