7వ నిజాంను తప్పుబట్టిన అసదుద్దీన్ ఒవైసీ

లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ ఇద్దరూ నిజాంను మోసం చేశారని చెప్పారు.

By Medi Samrat  Published on  17 Sep 2022 10:48 AM GMT
7వ నిజాంను తప్పుబట్టిన అసదుద్దీన్ ఒవైసీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం/ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆయన 7వ నిజాంను తప్పుపట్టారు. 1948 జూన్ 15న ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అన్నారు. ఆ డ్రాఫ్ట్ ను నిజాం ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగి ఉండేది కాదని చెప్పారు. కశ్మీరీలకు ఇచ్చిన ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని.. నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని చెప్పారు. లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ ఇద్దరూ నిజాంను మోసం చేశారని చెప్పారు.

ఎంఐఎం ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. నాటి మజ్లిస్ కు నేటి మజ్లిస్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. రజాకార్ల నేత ఖాసీం రజ్వీకి, మజ్లిస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లా ఉద్దీన్‌లకు తాము వారసులమని ఒవైసీ అన్నారు. స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మజ్లిస్‌ కార్యకర్తలు, ముస్లింలు, హిందువులు, దళితులకు ఆరెస్సెస్‌, బీజేపీల విశ్వసనీయత పత్రాలు అక్కర్లేదని అన్నారు. రాచరిక పాలన ఉన్నప్పటికీ నిజాం దేవాలయాలకు ఉదారంగా నిధులు మంజూరు చేశారని ఒవైసీ అన్నారు. నిజాం హయాంలో జరిగిన అభివృద్ధిని, హిందువులు, ముస్లింల మధ్య ఐక్యతను నేటి బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.


Next Story