ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి నిరసన సెగ తాకింది. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న ఓవైసీపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఓవైసీని మహిళలు నిలదీశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థుల తరపున ఆయన విస్తృతంగా పర్యటించారు. నగరంలోని జాంబాగ్‌ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

అయితే తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని ఓవైసీని మహిళలు ప్రశ్నించారు. దీంతో ఆయన వారికి సమాధానం చెప్పకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా పాతబస్తీలో అనేక కాలనీలలో వరద నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ఇళ్లు కూలిపోగా, పలు ఇళ్లల్లో నీరు చేరి నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు కూడా అందరికి అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్‌ ఓవైసీ ఆదివారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు లేదని, ఒంటరిగానే బరిలో నిలిచామని చెప్పారు. చాలా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు తమకు బలమైన పోటీ ఉందని చెప్పారు.

సుభాష్

.

Next Story