అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రజలు సంతోషంగా ఉంటారు. అదే ఒక వేళ అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కాలనీ సమస్యలపై దృష్టి సారించిన బాలిక సమస్యలు పట్టించుకోని అధికారులపై పోరాడలకునుంది. వివరాల్లోకి వెళ్తే.. రహదారి మరమ్మతుల గురించి పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులపై ఓ 11 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు, సర్కిల్ 20లో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై కేసు నమోదు చేయాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి బాలిక శాహెర్ కౌర్ కంప్లైంట్ చేసింది.
గత సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన రహదారి ప్రమాదాల నివారణ కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రోడ్ల మరమ్మతుల విషయమై శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ అధికారులు పలు సూచనలు చేశారని శాహెర్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొంది. రోడ్లపై వాహనాల వేగం తగ్గించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ట్రాఫిక్ పోలీసులు సూచించగా.. నాలుగు నెలలు అవుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని శాహెర్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొంది.