అమిత్ షా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి

All set for Amit Shah's visit to Telangana. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభలో

By Medi Samrat  Published on  14 May 2022 9:50 AM GMT
అమిత్ షా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి

శనివారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించ‌నున్నారు. ఏప్రిల్ 14న మొద‌లైన‌ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర.. మే 14 సాయంత్రం తుక్కుగూడ, మహేశ్వరం వద్ద ముగుస్తుంది. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సభకు భారీగా జనం హాజరవుతారని బీజేపీ నాయ‌కులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అమిత్ షా ప‌ర్య‌ట‌న నేఫ‌థ్యంలో విమ‌ర్శ‌ల భాణాలు ఎక్క‌పెట్టారు. తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ ప్రశ్నలకు స్పందించాలని కోరారు.

తెలంగాణలో అమిత్ షా పర్యటన బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచనుంది. శుక్రవారం రంగారెడ్డిలోని తుక్కుగూడలో జ‌రుగ‌నున్న స‌భ ఏర్పాట్లను కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా బీజేపీ ప్రస్తుతం వ్యవసాయం, రైతుల కష్టాలను ప్రజలకు వెల్లడిస్తోందన్నారు.

ఇప్పటి వరకు రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని ఎఫ్‌సిఐకి పంపలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భారీ వర్షాలకు వరి తడిసి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో విఫలమై రైతులను తీవ్ర నష్టానికి గురిచేస్తోందన్నారు. అన్ని పార్టీలు రైతులకు అండగా ఉండి ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it