20 లీటర్ల విసర్జకం కలిగి ఉన్న భారీ మూత్రపిండాన్ని తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
AINU doctors successfully remove huge kidney containing 20 liters of urine. హైదరాబాద్: దాదాపు 20 లీటర్ల మూత్రం నిలిచిపోయి సమస్యాత్మకంగా మారిన భారీ మూత్రపిండాన్ని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Feb 2023 9:33 AM GMTహైదరాబాద్: దాదాపు 20 లీటర్ల మూత్రం నిలిచిపోయి సమస్యాత్మకంగా మారిన భారీ మూత్రపిండాన్ని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు శస్త్రచకిత్స చేసి విజయవంతంగా తొలగించారు. రోగి శరీరంలోని ఎడమ కిడ్నీ దాదాపు 90 సెంటీమీటర్ల మేరకు విస్తరించి ఉండటమే కాకుండా దీనివల్ల శరీరంలోని ఇతర భాగాలు సైతం పలు సమస్యలు ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోగి సమస్యను నిశితంగా పరిశీలించడంతో పాటుగా విశేష అనుభవంతో చికిత్స నిర్వహించడం వల్ల సమస్యకు విజయవంతమైన పరిష్కారం లభించడమే కాకుండా రక్త ప్రసరణ, ఇతర సమస్యలు ఎదురవలేదు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 47 సంవత్సరాల వయసు కలిగిన ఈ రోగికి దాదాపు గత పది సంవత్సరాలుగా పొట్ట విస్తీర్ణం పెరిగిపోతుండటం, తరచుగా నొప్పి కలగడం పరిస్థితులు ఏర్పాడ్డాయి. అయితే దాదాపు ఒక దశాబ్దం నుంచి రోగి సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇటీవలి కాలంలో ఆయనకు విపరీతమైన కడుపునొప్పి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో రోగి ఇటీవల మూత్రపిండం, మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యల్లో పేరెన్నికగన్న ఏఐఎన్‌యూ వైద్యులను సంప్రదించి తన సమస్యను వివరించారు. దీంతో జనవరి రెండో వారంలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది.
ఏఐఎన్‌యూ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సయద్ మహ్మద్ గౌస్ ఈ రోగి చికిత్స గురించి స్పందిస్తూ.. ''రోగికి ఇటీవలి కాలంలో ఆకలి తగ్గిపోవడం, తరచుగా వాంతులు రావడం, కడుపులో విపరీతమైన నొప్పి వంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఏఐఎన్‌యూలో చేర్చిన తర్వాత తప్పనిసరి రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేయగా, ఎడమవైపున్న కిడ్నీ విపరీతంగా పెరిగిపోయింది. పనిచేయని స్థితికి చేరింది. మూత్రపిండం నుంచి మూత్రం విసర్జితం కాకపోవడం వల్ల విపరీతంగా నిలిచిపోయిన వ్యర్థం వల్ల పొట్ట పెద్ద ఎత్తున ఉబ్బినట్లుగా మారిపోయింది. దీనివల్ల పెద్దప్రేవుగల భాగము, ఇతర ప్రాణాధార అవయవాల సహజ పనితీరు దెబ్బతినేందుకు కారణం అయింది'' అని తెలిపారు.
''ఏఐఎన్‌యూలో శస్త్ర చికిత్స ద్వారా మూత్ర పిండమును తీసి వేసే ప్రక్రియ అయిన (నెఫ్రెక్టమీ)ని మేం నిర్వహించాం. దాదాపుగా 20 లీటర్ల మేరకు విసర్జితం కాకుండా నిలిచిపోయిన మూత్రాన్ని రోగి ఎడమ మూత్రపిండంలో నుంచి తొలగించాం. ఇంతటి భారీ కిడ్నీని తొలగించడానికి నైపుణ్యవంతులైన శస్త్రచికిత్స వైద్యులే కాకుండా చికిత్స అనంతరం సరైన రీతిలో మార్గదర్శనం చేసే పరిస్థితులు సైతం అవసరం. ఈ మేరకు తగురీతిలో శస్త్రచికిత్స చేయని పక్షంలో భారీగా ఉబ్బిన మూత్రపిండం నుంచి రక్తం కారడం లేదా చికిత్స అనంతరం పనితీరులో సమస్యలు ఎదురవడం వంటివి సంభవిస్తాయి'' అని వివరించారు.
చికిత్స అనంతరం డిశ్చార్జీ చేయడానికి ముందు మూడు రోజుల పాటు రోగిని పరిశీలనలో ఉంచారు. డిశ్చార్జీ అనంతరం సైతం ఏఐఎన్‌యూ వైద్యుల పరిశీలన రోగికి కొనసాగించబడింది. ఈ నేపథ్యంలో రోగి వేగంగా కోలుకోవడంతో పాటుగా సాధారణ ఆహారం తీసుకోగలుగుతున్నారని, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతున్నారని వైద్యులు వివరించారు. ఈ కీలక సంక్లిష్ట ప్రక్రియలో డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్‌కు డాక్టర్ రాజేష్, డాక్టర్ అమిష్ తో పాటుగా నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్ తమ సహాయ సహకారాలు అందించారు.
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ గురించి:
ది ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) మూత్ర వ్యవస్థ వ్యాధులు, మూత్రపిండ జబ్బులకు సంబంధించిన చికిత్సలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు కలిగి ఉంది. ఏఐఎన్‌యూలో మూత్ర వ్యవస్థ వ్యాధులు, మూత్రపిండ జబ్బులకు సంబంధించిన చికిత్సలో సమగ్రమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన సేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ టెక్నిషియన్ల వల్ల రోగికి అవసరమైన చికిత్సను సమగ్రంగా అందించడం జరుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్టణం, సిలిగురి, చెన్నైలో ఏఐఎన్‌యూ ఆస్పత్రులు తమ సేవలు అందిస్తున్నాయి.