75 ఏళ్ల రైతు కిడ్నీలో 300 రాళ్లు.. విజయవంతంగా తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
75 ఏళ్ల రైతు మూత్రపిండంలో నుంచి 300 రాళ్లను ఏఐఎన్‌యూ వైద్యులు విజయవంతంగా తొలగించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 March 2023 8:52 AM GMTరోగి మూత్రపిండంలో 300 రాళ్లు.. విజయవంతంగా తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
* భారీ సంఖ్య, పరిమాణంలో ఉన్నరాళ్లతో తీవ్రంగా బాధపడిన వృద్ధుడు
* లేజర్ శస్త్రచికిత్సతో విజయవంతంగా తీసిన ఏఐఎన్‌యూ హైటెక్ సిటీ వైద్యులు
హైదరాబాద్: ఆయన ఒక రైతు. వయసు 75 ఏళ్లు. అలాంటి వ్యక్తికి మూత్రపిండంలో ఏకంగా 300 రాళ్లు ఉన్నాయి. వాటిని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి హైటెక్ సిటీ శాఖ వైద్యులు విజయవంతంగా తొలగించారు. సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మామూలే అయినా, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రం, ఇలాంటి రోగులకు శస్త్రచికిత్స చేయడం, వాటిని తీయడం వైద్యులకు చాలా సంక్లిష్టం, సవాళ్లతో కూడుకున్న వ్యవహారం అవుతుంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన రాంరెడ్డి అనే 75 ఏళ్ల రైతుకు గత కొన్ని నెలలుగా విపరీతమైన వెన్నునొప్పి, వీపు కిందిభాగంలో నొప్పిగా ఉండటంతో హైటెక్‌సిటీ ప్రాంతంలోని ఏఐఎన్‌యూకు వచ్చారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్ తీయగా.. కుడివైపు మూత్రపిండంలో ఆయనకు ఏకంగా 7 సెంటీమీటర్ల పరిమాణంలో రాయి ఉన్నట్లు తేలింది.
రాంరెడ్డికి అందించిన చికిత్స గురించి ఏఐఎన్‌యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ మహ్మద్ తైఫ్ బెండిగేరి మాట్లాడుతూ.. “7 మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లీమీటర్ల పరిమాణంలో రాళ్లు సాధారణంగా రోగుల్లో కనిపిస్తుంటాయి. కానీ, 7 సెంటీమీటర్ల స్థాయిలోని రాయి అంటే రోగికి చాలా బాధాకరంగా ఉంటుంది. రోగి వృద్ధాప్యంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఈ చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చాయి. అయితే, డాక్టర్ సి.మల్లికార్జున నేతృత్వంలోని బృందం తగిన జాగ్రత్తలు తీసుకుని, అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించి అధునాతన కీహోల్ శస్త్రచికిత్సను నిర్వహించింది” అని చెప్పారు.
“కేవలం 5 మిల్లీమీటర్ల పరిమాణంలో కోత ద్వారా 7 సెంటీమీటర్లకు పైగా ఉన్న రాయిని తొలగించాము. ఈ పెద్ద రాయి దగ్గరే 300కు పైగా చిన్న చిన్న రాళ్లు కూడా ఉన్నాయి. సాంకేతికంగా సవాలుతో కూడిన ఈ ప్రక్రియలో, మూత్రపిండాల నుంచి మొత్తం 300కు పైగా రాళ్లను తీసేశాము. రోగికి ఎలాంటి సమస్యలు లేకపోవడంతో, శస్త్రచికిత్స తర్వాత రెండో రోజు డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ తైఫ్ తెలిపారు.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మన సమాజంలో సాధారణమే. మొత్తం జనాభాలో 6% - 12% మధ్య ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటారు. భారతీయుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో కిడ్నీల్లో రాళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల నడుం కిందిభాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇంకా మూత్రంలో మంట లేదా మూత్రంలో రక్తపుచారలు కనిపించవచ్చు. సాధారణ పరీక్షలతో సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడానికి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుంటుంది.
డాక్టర్ సి.మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ దీపక్ రాగూరి, డాక్టర్ లీలాకృష్ణ సహకరించారు. ఈ నిపుణుల బృందానికి డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నీలం, డాక్టర్ సహజతో కూడిన మత్తు వైద్యుల బృందం సహకరించింది. అత్యాధునిక ఎల్ఈడీ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర పరికరాలు ఉపయోగించడంతో రాంరెడ్డి లాంటి రోగులు ఆసుపత్రిలో అతి తక్కువ రోజులు ఉండి, అతి తక్కువ సమస్యలతో రాళ్లను పూర్తిగా తొలగించుకోవచ్చు. రాంరెడ్డి మర్నాటి నుంచే తన రోజువారీ పనులు చేసుకుంటున్నారు, ఆయనకు ఇక విశ్రాంతి కూడా అక్కర్లేదు.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ విధానం గురించి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలను నివారించడానికి వీలైనంత త్వరగా చికిత్స పొందండి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నా, అసలు లక్షణాలేవీ బయటపడకపోవచ్చు. లేదా చాలా తక్కువ అస్పష్టమైన లక్షణాలు ఉండొచ్చు.
అవి మూత్రపిండాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయని గమనించాలి. క్రమం తప్పకుండా మూత్రపిండాల వైద్యపరీక్షలతో దీన్ని సులభంగా గుర్తించగలం. ఒకసారి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే.. మళ్లీ మరోసారి కూడా ఏర్పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అధిక ప్రమాదం ఉన్న వారు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు తప్పక చేయించుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి రాబోయే వేసవి నెలల్లో ప్రజలు ఎక్కువ నీరు తాగాలని ఏఐఎన్‌యూ వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ గురించి:
ద ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) అనేది యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు “సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్”. భారతదేశంలో మూత్రపిండాల చికిత్సలకు సంబంధించి ఇది అతిపెద్ద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలలో ఏఐఎన్‌యూ సమగ్ర శ్రేణి క్లినికల్ సేవలను అందిస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్లతో కూడిన బృందం రోగి చికిత్సలోని ప్రతి స్థాయిలో అత్యున్నత వైద్యప్రమాణాలు పాటిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, సిలిగురి, చెన్నైలలో ఈ ఆస్పత్రులు ఉన్నాయి.