ఏఐజీ చైర్మన్ డి. నాగేశ్వర్ రెడ్డికి అరుదైన పురస్కారం

AIG chairman Dr Nageshwar Reddy wins Rudolf V Schindler award. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో విశిష్ట సేవలు అందించే వైద్య నిపుణులకు అందించే పురస్కారం ఈ ఏడాది నాగేశ్వర్‌రెడ్డికి దక్కింది.

By Medi Samrat  Published on  26 May 2021 2:43 PM IST
AIG chairman Dr Nageshwar Reddy

ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్, జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో విశిష్ట సేవలు అందించే వైద్య నిపుణులకు అందించే పురస్కారం ఈ ఏడాది నాగేశ్వర్‌రెడ్డికి దక్కింది. జీఐ ఎండోస్కోపి విభాగంలో ప్రపంచంలో అత్యున్నత సంస్థలలో ఒకటైన ది అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపి తమ వార్షిక క్రిస్టల్ అవార్డులను ప్రకటించింది. అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకుడు, ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీగా గౌరవించే డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ పేరిట అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) సంస్థ ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తోంది. 2021 సంవత్సరానికి గాను నాగేశ్వర్‌రెడ్డికి ఈ పురస్కారం దక్కింది. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపిగా పరిగణించబడే డాక్టర్ షిండ్లర్ పేరుతో ప్రధానం చేసే 'రుడాల్ఫ్ వి. షిండ్లర్' అవార్డును అత్యున్నతమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. భారతదేశం నుంచి ఈ అవార్డు సొంతం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిలిచారు. ఈ అవార్డును ఏఎస్‌జీఈ ప్రెసిడెంట్ డాక్టర్ క్లాస్ మెర్జెనర్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి వర్చువల్‌ విధానంలో ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా క్లాస్ మెర్జెనర్ మాట్లాడుతూ.. ఎండోస్కోపీ విధానంలో అందిస్తున్న అధునాతన వైద్యసేవలు, పరిశోధన, సునిశిత బోధన, అంతర్జాతీయ భాగస్వామ్యంతోపాటు మార్గదర్శకుడిగా నిలిచినందుకు గుర్తింపుగా ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎండోస్కోపీ చికిత్సలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎండోస్కోపిక్ పరిశోధన, బోధన లేదా డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ ప్రమాణాల బాటలో జీఐ ఎండోస్కోపి రంగానికి సేవలు చేసినవారికి అత్యున్నత పురస్కారాన్ని అందించడం జరుగుతుందన్నారు.భారత్ లోనే ఎండోస్కోపిని ప్రోత్సహించినవారిలో మొట్టమొదటి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అని తెలిపారు.

జీర్ణకోశ వ్యాధి నిపుణులకు ఒక కల అయిన ఈ అవార్డును పొందడాన్ని తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ డి నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. 'ASGE యొక్క అంతర్జాతీయ సభ్యుడిగా నాకు ASGE యొక్క రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు. మనం ఎక్కడ పనిచేస్తున్నామనే దానికన్నా.. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, అంకితభావంతో పనిచేస్తున్నామనే అంశాన్ని సమాజం గుర్తిస్తోందని అన్నారు. నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎండోస్కోపి రంగానికి నేను అందించి సహకారం, నా విజయాలు.. నా భార్య, నా కుంటుంబం సాకారం లేకుంటే సాధ్యమయ్యేవి కాదని అన్నారు. ఏఐజీ హాస్పిటల్స్‌లోని నా సహచరులకు, సిబ్బందికి నేను రుణపడి ఉంటానని వెల్లడించారు.


Next Story