కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా అవి హైదరాబాద్‌కు వ్యాపించాయి. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో యువకులు ఆందోళన చేపట్టారు. అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేసి మిలటరీ రిక్రూట్‌మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బస్టాండ్‌లో ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌లోకి దూసుకువెళ్లారు. అక్కడ ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. పట్టాలపై పార్శిల్ సామాన్లు వేశారు. రైలు పట్టాలకు నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు సైతం నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో ప్రయాణీకులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. అనుకోని ఈ ఘటనతో అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.