సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఆందోళన కారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన విద్యార్థులు ప్లాట్‌ఫామ్‌పైన ఉన్న పార్శిల్ సామాన్లను పట్టాలపైకి వేసి నిప్పంటించారు. మూడు రైళ్లకు నిప్పంటుకోగా..అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. ప్లాట్ ఫామ్‌పై షాపులు, స్టాల్స్‌ను ధ్వంసం చేశారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తూ పాత విధానంలోనే సైనిక నియమాకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్లాట్ ఫామ్ మొత్తం పోలీసులు ఖాళీ చేయించారు. భారీగా అదనపు బలగాలను తరలిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తొలుత సంయమనం పాటించిన పోలీసులు.. 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.