హైద్రాబాద్ : నగరంలోని అంబర్‌పేటలో భారీ ప్రమాదం తప్పింది. అంబర్‌పేట మారుతీనగర్‌లో ఉన్న ఓ యాసిడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున రియాక్టర్ పేలింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో బస్తీల్లోకి యాసిడ్ ప్రవాహంలా వచ్చి చేరింది. దీంతో వెలువడిన వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు దానిని సీజ్‌చేశారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదుచేశారు. అయితే.. యాసిడ్ ఫ్యాక్టరీపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీ ఇక్కడ ఉందని స్థానికులు వెల్లడించారు. ఇన్నాళ్లుగా లైసెన్స్ లేకుండా కంపెనీని ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు.