ఇంజినీరింగ్ బృందం చేసిన చిన్న పొరపాటు.. అతడికి రూ.40 లక్షల నష్టం

ఇంజినీరింగ్ బృందం చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కుటుంబం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 July 2023 1:35 PM IST
ORR, Water clogging, Kokapet

ఇంజినీరింగ్ బృందం చేసిన చిన్న పొరపాటు.. అతడికి రూ.40 లక్షల నష్టం

ఇంజినీరింగ్ బృందం చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కుటుంబం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ఇంజనీరింగ్ బృందం చేసిన తప్పుకు అతడు 40 లక్షల రూపాయలను తన జేబు నుండి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. కోకాపేట్‌లోని ORR సర్వీస్ రోడ్డులో పారాపెట్ గోడకు డ్రైన్ రంధ్రాలు వేయడం ఇంజినీరింగ్ బృందం మరచిపోగా.. నీటి ఎద్దడి ఏర్పడి కారణంగా వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కోకాపేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై నీరు నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో కోరారు. ఎన్నో కార్లు నీటిలో నుండి వెళ్లాల్సి వస్తోందని.. అలా వెళ్లిన కార్లకు రిపేరీలు మాత్రం కన్ఫర్మ్ గా అవుతున్నాయని తెలిపారు.

గత గురువారం ఉదయ్ తేజ అనే వ్యక్తికి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మాదాపూర్‌కు చెందిన ఉదయ్ తేజ ఎం అనే వ్యక్తి గర్భిణి అయిన భార్యను కారులో తీసుకుని వెళుతూ ఉండగా.. అతడి కారు నీటిలో నిలిచిపోయింది. దీంతో అతడు టోయింగ్ సేవలను అతడు ఆశ్రయించాల్సి వచ్చింది. అతను ట్విట్టర్‌లో తన బాధాకరమైన అనుభవాలను పంచుకున్నాడు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం 2016 లో ప్రారంభించిన స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌డిపి) ఏ మాత్రం ప్రభావం చూపలేదని వాపోయాడు. అక్కడ నీళ్లు వెళ్లకుండా నిలిచిపోయిన కారణంగా 12 BMW, 8 బెంజ్ కార్లు ఆ రాత్రి నీటమునిగాయని తెలిపాడు. కోట్ల రూపాయలు పౌరులకు నష్టం వాటిల్లిందని అన్నాడు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించాడు. నాలాలు నిర్మించడం గొప్ప విషయమే కానీ 1 అడుగు ఎత్తులో గోడ వేసి నీటిని నాలాలోకి వెళ్లనివ్వకుండా చేయలేకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.

ఆడిటర్ అయిన ఉదయ్ తేజ న్యూస్ మీటర్ తో తన బాధను పంచుకున్నారు. “మేము మాదాపూర్‌కి వెళ్తున్నాము. వర్షపు నీటి కారణంగా రోడ్లు దాదాపు మూసుకుపోయాయి. అదృష్టవశాత్తూ మాతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. BMW లో ఉండే ప్రత్యేకమైన పార్కింగ్ మోడ్ కారణంగా, కారును వెంటనే బయటకు తీయలేకపోయాము. దీంతో మేము వర్షపు నీటిలో చిక్కుకున్నాము. చాలా సార్లు ఇలాంటి సమయాల్లో ఇటువంటి కార్లు అన్‌లాక్ అవ్వవు, ”అని చెప్పారు. “నా స్నేహితుడు దగ్గరే ఉండడంతో పది నిమిషాలలో అక్కడికి వచ్చి నాకు సాయం చేశాడు.. నేను నా భార్యను తీసుకొని అక్కడి నుండి నా స్నేహితుడి ఇంటికి పంపించాను. నేను, నా డ్రైవర్ వాహనాన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్లడానికి ఉదయం వరకు వేచి ఉన్నాం" అని వివరించారు.

ఉదయ్ వాహనానికి రూ.40 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇంజిన్లు రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా సర్వీస్ సెంటర్ తన కారును రెడీ చేసి డెలివరీ చేయడానికి మరో రెండు నెలలు పడుతుందని చెప్పారన్నారు ఉదయ్. " ఇకపై నేను నా భార్యను క్యాబ్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నా నవజాత శిశువును కూడా ఇప్పుడు క్యాబ్‌లో తీసుకురావాలి. పిలిచిన వెంటనే రక్షించడానికి వచ్చిన స్నేహితుడిని కలిగి ఉండటం నా అదృష్టం" అని చెప్పారు. నా పరిస్థితి సరే.. మిగిలిన వ్యక్తుల సంగతేంటి? స్త్రీలు ఒంటరిగా క్యాబ్ లో వెళుతూ ఉన్న సమయంలో ఇలాంటివి ఎదురైతే ? అని అతను ప్రశ్నించారు. రోడ్డు నిర్మించిన ఇంజినీరింగ్ బృందం చేసిన చిన్న పొరపాటు వల్ల నీరు నిలిచిపోయిందని వాపోయారు. ఇందుకు బాధ్యులైన ఇంజినీరింగ్‌ బృందంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తన కారుకు జరిగిన నష్టానికి పరిహారం కూడా ఇవ్వాలని కోరారు. తేజ డిమాండ్లపై అధికారులు స్పందించాల్సి ఉంది.

Next Story