ఓ ఇంటికి రూ.7.90 లక్షల కరెంట్ బిల్లు..యజమాని షాక్

ఓ ఇంటికి ఒకే నెలకు ఏకంగా రూ.7,97,576 కరెంట్‌ బిల్లుని ఇచ్చారు. దీంతో.. సదురు ఇంటి ఓనర్‌ షాక్‌కు గురైంది.

By Srikanth Gundamalla  Published on  20 Jun 2023 8:55 AM GMT
Hyderabad, Uppal, Shocking Power bill, 7 Lakh Rupees

ఓ ఇంటికి రూ.7.90 లక్షల కరెంట్ బిల్లు..యజమాని షాక్

సాధారణంగా ఇళ్లకు కరెంటు బిల్లులు ఎంత వస్తాయి..? రూ.500 లేదంటే రూ.1000 వస్తుంది కదా. ఇక ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎక్కువగా వాడుతున్న వారికి అయితే వేలల్లో ఉంటుంది. కానీ.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ ఇంటికి మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా కరెంట్‌ బిల్లు ఇచ్చారు అధికారులు. ఒకే నెలకు ఏకంగా రూ.7,97,576 కరెంట్‌ బిల్లుని ఇచ్చారు. దీంతో.. సదురు ఇంటి ఓనర్‌ షాక్‌కు గురైంది. ఇంతమొత్తంలో ఎలా బిల్లు ఇస్తారంటూ లబోదిబోమంటోంది. ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పరిధి హైకోర్టు కాలనీలో శ్రీదేవి ఇంట్లో ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే.. రెండుఫ్లోర్‌లు ఉన్నాయని.. ఖాళీగా ఉన్న పోర్షన్‌కే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు ఇచ్చారని ఇంటి యజమానురాలు తల్లి అండాలు అంటోంది. ఎలక్ట్రిషియన్‌ రీడింగ్‌కు వచ్చినప్పుడు బిల్లు ఇవ్వకుండా వెళ్లిపోయాడని.. ఆ తర్వాత ఆన్‌లైన్లో చూస్తే రూ.7,97,576 కరెంట్‌ బిల్లు కనిపించిందని ఆమె చెప్పారు. అయితే.. అధికారులను నిలదీయగా సాంకేతిక లోపం వల్లే జరిగిందని చెప్పారని అన్నారు. మీటర్‌ మార్చుకోవాలని సూచించారని తెలిపారు. మీటర్‌ మార్చడం కోసం కరెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్‌ అధికారులే తెచ్చి ఇవ్వాల్సింది పోయి ఆఫీసుల చుట్టూ తిప్పించారని మండిపడ్డారు. ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యంగానే తప్పుడు బిల్లులు ఇస్తున్నారని అన్నారు. అంత బిల్లు ఆన్‌లైన్‌లో చూడటంతో గుండె ఆగిపోయినంత పని అయ్యిందన్నారు బాధితురాలు. ఇలా విద్యుత్‌ మీటర్లలో తప్పుడు బిల్లులు రావడం ఇదే మొదటిసారి కాదు. అధికారులు ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Next Story