హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ బంగారు దుకాణం ముందు కూర్చున్న వ్యక్తి, ఒక్కసారిగా వెనక్కి పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన కొమ్మినేని నరసింహారావు చౌదరి (48)గా పోలీసులు గుర్తించారు. ఆయన గత కొంతకాలంగా కూకట్‌పల్లిలో ఒంటరిగా నివసిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నరసింహారావు శనివారం రాత్రి మద్యం సేవించి, కూకట్‌పల్లిలోని శ్రీ సాయిరాం గోల్డ్ షాప్ ముందు నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ఆయన, అదే షాపు ముందు రోడ్డు పక్కన కూర్చున్నాడు. అలా కూర్చుని ఉండగానే ఒక్కసారిగా అదుపుతప్పి వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలో తల నేలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన ప్రాణాలు విడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.