హైదరాబాద్: పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న రాత్రి వరకు 19 మంది చనిపోగా.. ఉదయానికి ఆ సంఖ్య 37కి చేరింది. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలిలో ఉన్న 57 మంది సురక్షితంగా ఇళ్లకు చేరినట్టు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం ఉన్నట్టు సమాచారం.
అటు నేడు పాశమైలారంలోని రియాక్టర్ పేలిన సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ భారీ పేలుడు ఘటనతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డెడ్‌బాడీలను గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు.
మృతుల కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ సేకరించి, పోల్చి చూసిన తర్వాతే బాడీలను అప్పగించేందుకు వీలవుతుంది. భారీ పేలుడు ధాటికి బరువైన సిమెంట్ పిల్లర్లు, ఇనుప గడ్డర్లు కూలిపోగా వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. శిథిలాలు వెలికి తీస్తున్న కొద్దీ మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పన్నమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వల్లే పలువురు సజీవదహనమయ్యారు. దీంతో పాటు పేలుడు ధాటికి సమీపంలోని మూడు అంతస్తుల భవనం సైతం కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు.