Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. 29 MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది.
By Srikanth Gundamalla
Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. 29 MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. నగరంలో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎంతో మంది ప్రయాణికులు వీటిల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో నడవనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. పలు ఆపరేషనల్ కారణాలతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైల్వే అధికారులకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు:
లింగంపల్లి-ఉందానగర్ (47213), ఉందానగర్-లింగంపల్లి (47211), ఉందానగర్-సికింద్రాబాద్ (47246), ఉందానగర్- సికింద్రాబాద్ (47248), లింగంపల్లి-ఉందానగర్ (47212), సికింద్రాబాద్-ఉందానగర్ (47247), ఉందానగర్-సికింద్రాబాద్ (47248), సికింద్రాబాద్-ఉందానగర్ (47249), ఉందానగర్-లింగంపల్లి (47160), లింగంపల్లి-ఫలక్‌నుమా (47188), ఫలక్‌నుమా-లింగంపల్లి (47167), లింగంపల్లి-ఉందానగర్ (47194), లింగంపల్లి-ఉందానగర్ (47173) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. వీటితో పాటు రామచంద్రపురం – ఫలక్‌నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, ఫలక్‌నుమా – హైదరాబాద్, ఫలక్‌నుమా – హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి తదితర రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
ఇక రానున్న సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో.. 20 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-కాకినాడ, హైదరాబాద్-తిరుపతి రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు పలు తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.