ధైర్యంగా ఉండండి.. గాంధీ ఆసుపత్రిలో కోలుకున్న 110 ఏళ్ల రామానంద తీర్థ
110-year-old beats Covid in Gandhi Hospital. తాజాగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 110 సంవత్సరాల వృద్ధుడు కరోనాను జయించి ఎంతో మందిలో ధైర్యాన్ని నింపుతున్నారు.
By Medi Samrat Published on 13 May 2021 5:40 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే భయపడే వారు ఎంతో మంది ఉన్నారు. భయపడకండి.. కరోనాను జయించవచ్చు అని ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ ఉన్నారు. 80-90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు కూడా కరోనా జయించారని ఉదాహరణలు కూడా చూపిస్తూ ఉంటారు.
తాజాగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 110 సంవత్సరాల వృద్ధుడు కరోనాను జయించి ఎంతో మందిలో ధైర్యాన్ని నింపుతున్నారు. హైదరాబాద్‌లోని కీసరగుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 110 ఏళ్ల రామానంద తీర్థ కరోనా బారినపడడంతో ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ఏప్రిల్ 24న కరోనా లక్షణాలతో రామానంద తీర్థ గాంధీ ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల చికిత్సతో ఆయన పూర్తిగా కోలుకున్నారు. బుధవారం(మే 12) నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆయనకు నెగటివ్‌గా నిర్దారణ అయింది.ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజా రావు వెల్లడించారు. అయినప్పటికీ కొద్దిరోజులు సాధారణ వార్డులో ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచుతామని తెలిపారు. 18 రోజుల చికిత్స అనంతరం రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారని ఎం.రాజారావు తెలిపారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించనున్నారు. ఏది ఏమైనా ఇలా 110 సంవత్సరాల వయసులో కరోనాను జయించడం సూపర్ అని అంటున్నారు.
ఇక బెంగళూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్ఎస్ దొరస్వామి కూడా కరోనా బారినపడి కోలుకున్నారు. ఆయన వయసు 104 సంవత్సరాలు. చికిత్స సమయంలో ఆయన ఆత్మవిశ్వాసంతో కనిపించారని, అందుకే ఔషధాలు పనిచేశాయని వైద్యులు వివరించారు. నిన్న నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 104 ఏళ్ల దొరెస్వామి కరోనా నుంచి కోలుకుని బుధవారం(మే 12) డిశ్చార్జి అయ్యారు. ఐదు రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని.. కానీ పెద్దగా ఇబ్బందిపెట్టే ఆరోగ్య సమస్యలేవీ తలెత్తలేదని అన్నారు. ముందు నుంచి నాకు కొంత శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతున్నానని దొరెస్వామి తెలిపారు. దొరెస్వామి పూర్తి పేరు హరొహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి. ఏప్రిల్ 10,1918లో ఆయన జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన 1943-1944 మధ్య 14 నెలల జైలు శిక్ష అనుభవించారు.