అత్తాపూర్‌లో విషాదం.. గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 8:15 AM GMTఅత్తాపూర్‌లో విషాదం.. గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులు కావడంతో ఓ పదకొండేళ్ల బాలుడు గాలిపటం ఎగరవేడయానికి ఇంటిపైకి ఎక్కాడు. ఈ క్రమంలోనే గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బాలుడి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అత్తాపూర్‌లో తల్లిదండ్రులతో పాటు ఉంటోన్న తనిష్క్ గాలిపటం ఎగరేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులు, అన్నయ్యతో కలిసి ఇంటీ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పైకి ఎక్కాడు. అయితే.. అందరితో పాటే గాలిపటం ఎగరేయసాగాడు. కాగా.. గాలిపటం ఎగరేస్తుండగా తనిష్క్ అనుకోకుండా కరెంట్ తీగలకు తగిలాడు. ఏసీకి విద్యుత్ సరఫరా అయ్యే తీగలకు తాకడంతో బాలుడు విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు.
అది గమనించిన తనిష్క్ అన్నయ్య విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు చెప్పాడు. వారు కూడా అపార్ట్‌మెంట్‌పైకి వచ్చి స్పృహకోల్పోయి ఉన్న బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక ఆస్పత్రిలో బాలుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనతో బాలుడి కుటుంబంలో పండగపూట విషాదం అలుముకుంది. చిన్నకొడుకు గాలిపటం ఎగరేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. గాలిపటాలు ఎగరేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలకు పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా పండగ వేళ అందరూ గాలిపటాలు ఎగరేస్తుంటారు. అయితే.. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చిన్నపిల్లల వద్ద పెద్దలు ఉండాలని చెప్పారు. ముఖ్యంగా బిల్డింగ్‌ల పైన గాలిపటాలు ఎగరేయడం ప్రమాదమని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలను ఎంచుకుని అక్కడ గాలిపటాలు ఎగరేయడం మంచిదని సూచించారు. దగ్గరలో కరెంటు తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేకుండా చూసుకోవాలని చెప్పారు.