హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లను తెలంగాణ బడ్జెట్‌లో కేటాయించినట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అదే విధంగా జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కోసం రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు, ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.200 కోట్లు, పాతబస్తీ వరకు మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించారు. భట్టి మాట్లాడుతూ.. బడ్జెట్ కేవలం సంఖ్యల సమాహారం కాదు, మన విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ కూడా అని వ్యాఖ్యానించారు.
రిజీనల్ రింగ్ రోడ్డుకు రూ.1525 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. బీసీ సంక్షేమం కోసం రూ.9,200 కోట్లు, వైద్య ఆరోగ్యం కోసం రూ.11,468 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సిలిండర్, రైతు రుణ మాఫీ వంటి ఎన్నికల హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. 200యూనిట్ల కంటే తక్కువ వినియోగించే అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని, అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేస్తున్నామని, ప్రభుత్వం బిల్లుల్ని డిస్కమ్‌లకు చెల్లిస్తున్నామని తెలిపారు.