10 కిలోల ఫుట్‌బాల్ పరిమాణంలో ఉన్న పొత్తికడుపు కణితి తొల‌గింపు

10 Kg Football sized abdominal tumor removed in Hyd hospital.వైద్యులు 10 కిలోల బరువున్న 'ఫుట్ బాల్ సైజు' కణితిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2022 2:25 PM IST
10 కిలోల ఫుట్‌బాల్ పరిమాణంలో ఉన్న పొత్తికడుపు కణితి తొల‌గింపు

హైదరాబాద్: ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎఐఎన్‌యు) వైద్యులు మూత్రపిండాల్లో 10 కిలోల బరువున్న 'ఫుట్ బాల్ సైజు' కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ శస్త్రచికిత్స తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది కాగా.. దేశంలో రెండోది మాత్రమే. డాక్టర్ సి.మల్లికార్జున నేతృత్వంలో డాక్టర్ తైఫ్ బెండిగెరి, డాక్టర్ కె.రాజేష్ రెడ్డిలతో కూడిన యూరాలజిస్టుల బృందం ఈ సంక్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది.

కడపకు చెందిన 53 ఏళ్ల రోగి కడుపు వాపుతో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలో వైద్యులు పెద్ద పొత్తికడుపు కణితిని కనుగొన్నారు. ఎడమ మూత్రపిండాల నుంచి ఆ కణితి వచ్చినట్లు ఇమేజింగ్ వల్ల తెలిసింది. ఆ కణితి ఎంత పెద్దదంటే.. అది పొత్తికడుపు కుహరంలో మూడింట రెండు వంతుల భాగాన్ని ఆక్రమించింది. దీనివల్ల పేగులు కుడి దిగువ భాగంలోకి వెళ్లిపోయాయి.

రోగి పరిస్థితి, తదుపరి చికిత్స గురించి శస్త్రచికిత్స చేసిన యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున సి మాట్లాడుతూ.. "కణితి పరిమాణం దృష్ట్యా, మేము రోబోటిక్ ప్రక్రియ వద్దని నిర్ణయించుకున్నాము. దానికి బదులుగా ఓపెన్ శస్త్రచికిత్సను ఎంచుకున్నాము. చాలా కష్టపడిన తర్వాత కణితిని విజయవంతంగా తొలగించగలిగాము. శస్త్రచికిత్స అనంతరం కణితి ఏకంగా ఫుట్ బాల్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉందని తెలిసింది. మైక్రోస్కోపిక్ పరీక్ష ద్వారా ఇది క్యాన్సర్ (రీనల్ సెల్ కార్సినోమా) అని ఖరారైంది.


కణితి పెరుగుదల గురించి, శస్త్రచికిత్స ప్రక్రియలో పాల్గొన్న యూరాలజిస్టులు డాక్టర్ రాజేష్ కె. రెడ్డి & డాక్టర్ తైఫ్ బెండిగేరి ఇలా వివరించారు. పొత్తికడుపులో వాపు ఉంది. కానీ రోగి దాన్ని గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. లేదా నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. మా బృందం క్యాన్సర్ ప్రభావిత ఎడమ మూత్రపిండాన్ని తొలగించింది. కణితి పూర్తిగా తొలగిపోయిందన్న విషయం మైక్రోస్కోపిక్ సర్జికల్ మార్జిన్లతో స్పష్టమైంది. అదృష్టవశాత్తూ, కణితి మరే ఇతర అవయవాలకు వ్యాపించలేదు కాబట్టి, రోగికి ఎటువంటి అదనపు చికిత్స అవసరం లేదని నిర్ధారించాము. ఫాలోఅప్ చికిత్సలు, పరీక్షలను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అతడికి సూచించాము. ఇది క్రమం తప్పకుండా ఆయన్ను పర్యవేక్షించడానికి సహాయపడుతుంది అని తెలిపారు.

శస్త్రచికిత్స తర్వాత మైక్రోస్కోపిక్ పరీక్షలో కణితి ప్రాణాంతకమైనదిగా కనుగొనబడింది.

Next Story