హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రీ యూనియన్‌కి హాజరైన సత్య నాదెళ్ల

By Newsmeter.Network  Published on  30 Dec 2019 7:53 AM GMT
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రీ యూనియన్‌కి హాజరైన సత్య నాదెళ్ల

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1984 బ్యాచ్ రీయూనియన్
  • రీ యూనియన్ కి హాజరైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
  • ప్రపంచ నలుమూలలనుంచీ వచ్చిన ప్రముఖులు
  • సంతోషాన్ని పంచుకున్న 1984 బ్యాచ్ మేట్స్

హైదరాబాద్‌: 2019 డిసెంబర్ 25, 26 తేదీల్లో జరిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రీ యూనియన్ కి మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హాజరయ్యారు. 1984 బ్యాచ్ మేట్స్ అందరూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చి ఈ రీయూనియన్ లో పాల్గొనడం విశేషం.

ఈ మధ్యే 1984 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కి భారతీయ నావికాదళం ఉపయోగించిన ఓ భారీ లంగర్ ను, టోర్పెడోను వేలంలో కొని బహూకరించిన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో దేశ భక్తిని పెంచేందుకు, జాతీయ స్ఫూర్తిని రగిలించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయని స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. వీటిని విద్యార్థులకు కనిపించే విధంగా సరైన ప్రదేశంలో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన చాలామంది ప్రముఖులు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే. సత్యనాదెళ్ల, శాతను నారాయణ్, అజయ్ బంగ లాంటి బిజినెస్ లీడర్లు మాత్రమే కాక ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టాలీవుడ్ సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున లాంటి ఎందరో ప్రముఖులు ఈ స్కూల్లో చదువుకున్నవాళ్లే.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోవడం నిజంగా తనకు దొరికిన అదృష్టమని గతంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2017లో స్కూల్ ని సందర్శించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూల్లో ఉన్నప్పుడు తను క్రికెట్ బాగా ఆడేవాడినని, దాని ప్రభావం తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందనీ ఆయన చెప్పారు. ఒక వ్యక్తికి తన సామర్ధ్యంపై ఎంత నమ్మకం ఉండాలో క్రికెట్ కోచ్ వల్ల నేర్చుకోగలిగానన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1923లో ఏర్పాటయ్యింది. నవాబులు, జాగీర్ దార్లు, బ్రిటిష్ అధికారులు, ఉన్నతస్థాయి వర్గాలవారి పిల్లలు చదువుకోవడంకోసం అప్పట్లో ఈ స్కూల్ ని ఏర్పాటుచేశారు. 1950లో జమీందారీ వ్యవస్థ రద్దుకావడంతో ఈ స్కూల్ పబ్లిక్ స్కూల్ గా రూపాంతరం చెందింది. ఈనాటికి భారతదేశంలో ఉన్న టాప్ 10 స్కూల్స్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కి ప్రత్యేక స్థానం ఉంది.

Next Story