ప్రధాన జలాశయాల పరిరక్షణే ప్రధాన ధ్యేయం

By Newsmeter.Network  Published on  30 Dec 2019 7:30 AM GMT
ప్రధాన జలాశయాల పరిరక్షణే ప్రధాన ధ్యేయం

ముఖ్యాంశాలు

  • జీవో నెంబర్ 111 పై కేటీఆర్ వివరణ
  • అక్రమకట్టడాలను కూల్చివేయాల్సిందేనన్న కేటీఆర్
  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రక్షణే ధ్యేయం
  • కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన

హైదరాబాద్‌: జీవో నెంబర్ 111 కు సంబంధించి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ పెదవి విప్పారు. జీవో విషయంలో ప్రభుత్వం మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన వ్యాఖ్యానించారు.

తప్పనిసరిగా ఈ రెండు జలాశయాలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంకు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదన్న నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.

Hyderabad news

జీవో నెంబర్ 111ను ఉల్లంఘించి జలాశయాల పరిధిలో పెద్ద భవనాలను కట్టినవారిపై, అక్రమ లే అవుట్లు నిర్మించిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు. 63, 64, 77, 111, 112, 146 - ఆరు సర్వే నెంబర్లలో బడా భవనాలను నిర్మించిన బిల్డర్లపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.

దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందర్ రావు పంచాయతీ సర్పంచ్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. దానికి స్పందించిన పంచాయతీ అధికారులు ఈ ప్రాంతంలో పెద్ద భవనాలను, అక్రమ లే అవుట్లను నిర్మించిన బిల్లర్లపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ సర్వే నెంబర్లలో నిర్మితమైన పెద్ద పెద్ద భవనాలను అధికారులు కూల్చివేయడంతో కలకలం రేగింది.

హైదరాబాద్ లో నీటి కొరత గురించి నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలపైకూడా కేటీఆర్ సున్నితంగా స్పందించారు. హైదరాబాద్ మహానగరానికి నీటి కొరత అనేది అసలు లేనేలేదని ఆయన చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారాయన.

2020లో ఫార్మాసిటీ ప్రారంభమవుతుందని కేటీఆర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలపై కూడా ఆయన స్పందించారు.

తమను, తమ పార్టీని విమర్శించినవారు ఇప్పుడు పక్కరాష్ట్రంలో కూడా తమ పరిపాలనపై వ్యక్తమవుతున్న సంతృప్తిని చూసైనా కళ్లు తెరవాలని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు సాధిస్తున్న విషయం ప్రపంచమంతా చూస్తోందని ఆయన అన్నారు.

Next Story
Share it