హైదరాబాద్‌ మెట్రో మరో ముందడుగు...

By Newsmeter.Network  Published on  29 Nov 2019 5:31 AM GMT
హైదరాబాద్‌ మెట్రో మరో ముందడుగు...

హైదరాబాద్‌ మెట్రో మరో ముందుడుగు వేసింది. ఇప్పటికే రికార్డు సృష్టిస్తున్న మెట్రో...మరో కొత్త మార్గంలో పరుగులు తీసింది. ఒకటిన్నర కిలోమీటర్ల హైటెక్‌సిటీ– రాయదుర్గం మెట్రో కారిడార్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఉదయం హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతం కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి మెట్రో రైల్‌లో మైండ్‌ స్పేస్‌ ముందున్న రాయదుర్గం స్టేషన్‌ వరకు ప్రయాణం చేశారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు వెళ్లి అక్కడ బుల్‌ స్టాట్యూ ప్రారంభించారు. మెట్రో రైల్‌ ఎం.డి.ఎన్‌వీఎస్‌ రెడ్డి, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జొషీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ స్పెషల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐటీ ఉద్యోగులకు వెసులుబాటు

హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో మైండ్‌ స్పేస్‌ వరకు మెట్రో ప్రారంభం కావడంతో ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం ట్రాఫిక్‌లోనే గడపాల్సి ఉండేది. దీంతో ఐటీ ఉద్యోగులు నడుచుకుంటూనే కె.రహేజ, ఫేజ్‌–2లో ఉన్న కంపెనీలకు వెళ్తారు. ఇప్పుడు ఈ మార్గంలో మెట్రో ప్రారంభంతో ఐటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లలో 12.5 కోట్ల మంది ప్రయాణికులు

ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పేరు గాంచిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతోఈ ప్రాజెక్టును చేపట్టారు. రెండు సంవత్సరాల కిందట నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 12.5 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోజుకు 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ఈ రెండేళ్లలో మెట్రో రైళ్లు 86 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

Next Story