రౌడీ షీటర్లతో జనగణమన పాడించిన 'లేడీ సింగం' సుమతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2019 9:10 PM ISTఆమె కళ్లల్లోనే వృత్తికి న్యాయం చేయాలనే తపన కనిపిస్తోంది. ఆ మాటల్లో నిలువెత్తు నిజాయితీ తొణికిసలాడుతుంటుంది. ఆమె యూనిఫాం వేసుకుని బండి ఎక్కిందంటే రౌడీ షీటర్లు వణికిపోతారు.లాఠీ పట్టిందంటే నిద్రలో కూడా దొంగలు వణికిపోతారు. వృత్తి అంటే ఆమెకు ప్రాణం.ఆపద ఉందంటే వాలిపోతుంది. గడబిడ జరుగుతుందంటే ఏ సమయంలోనైనా వచ్చేస్తుంది.కుటుంబం, వృత్తి రెండు ముఖ్యమేనని చెబుతుంటుంది. తన 20 ఏళ్ల కెరీర్‌లో విలువలే ప్రాణంగా బతికారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా డ్యూటీని మరువలేదు. ముఖంలో ఎంత సీరియస్ ఉంటుందో..మనసులో అంత మంచి తనం ఉంటుంది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? 'లేడి సింగం' డీసీపీ సుమతి.
అర్ధరాత్రిలేదు, అపరాత్రి లేదు. శాంతి, భద్రతల కోసం ఎందాకైనా పోతుంది. లా అండ్ ఆర్డర్ ఆమె లాఠీతో కంట్రోల్ చేస్తుంది. మంగళవారం రాత్రి కూడా డ్యూటీ పని మీద వెస్ట్ జోన్ పరిధిలో సెర్చ్ చేశారు డీసీపీ సుమతి బృందం. 110 మంది పోలీసులతో హబీబ్ నగర్, మంగళ్ హాట్ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఆకతాయిలను, రోమియోలను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లతో జనగణమన పాడించారు. సిటీలో పీస్ అండ్ సేఫ్ ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతూ మరోసారి కనిపిస్తే...పీడీ యాక్ట్ పెడతామని రౌడీ షీటర్లను హెచ్చరించారు.
ఫస్ట్ డ్యూటీ రంగారెడ్డి జిల్లాలో..!
ఇక్కడే కాదు..డీసీపీ సుమతి ఎక్కడ పని చేసినా అంతే. వృత్తికి న్యాయం చేస్తారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఐపీఎస్ గా ట్రైనింగ్ అయ్యాక మొట్టమొదటి ఛార్జి రంగారెడ్డి జిల్లాలో. మొదటి సారే డెకాయిట్లకు చుక్కలు చూపించారు. వృత్తిలోని హ్యాపీనెస్‌ను అప్పుడే చూశానని చెబుతుంటారు సుమతి. అక్కడ నుంచి వరంగల్ అర్బన్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడ వృత్తి పరంగా చాలా నేర్చుకున్నానని చెప్పారు. మావోయిస్ట్ లు వద్దు అని వరంగల్ ప్రజలు అనుకుంటున్న సమయంలో అక్కడ డ్యూటీ చేశానని చెబుతారు సుమతి.
జాబ్ రిజైన్ చేద్దామనుకున్నా..కానీ..
ఒక దశలో జాబ్‌కు రిజైన్ చేద్దామనుకున్నానని కూడా చాలా సార్లు చెప్పారు డీసీపీ సుమతి. కాని..కుటుంబాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటానని అనేక ఇంటర్వ్యూల్లో అన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం ఉన్నప్పటికీ..మరీ అంత ఎక్కువుగా లేదని..ఎక్కడో తయారు చేసినవి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారని చెబుతుంటోంది. దొంగలు కూడా హై టెక్నాలజీ వాడుతుంటారని..ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి తప్పించుకుపోతుంటారనేది సుమతి అభిప్రాయం. పోలీసులు కూడా హై టెక్నాలజీతో చాలా దొంగతనాలను కూడా అరికట్టామన్నారు సుమతి.
కేసులు ఛేదించడంలో డీసీపీ సుమతి స్టైలే వేరు
కేసులు ఛేదించడంలో కూడా సుమతిది ప్రత్యేక శైలి. ఏ కేసునైనా చిన్న క్లూతో పట్టేస్తారు. ఆ క్లూ కోసం 30 గ్రామాలు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని రోజుల క్రితం అమీర్ పేట్ లో ఇస్రో ఉద్యోగి హత్యను కూడా 24 గంటల్లో ఛేదించారు. వృత్తి పట్ల అంకితాభావం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇలాంటివి వందల కేసులను సునాయసంగా డీసీపీ సుమతి పరిష్కరించారు.
డిపార్ట్మెంట్ లో మహిళలు ధైర్యంగా ఉన్నారు: సుమతి
తాను డిపార్ట్ మెంట్‌లోకి వచ్చినప్పుడు మహిళా కానిస్టేబుళ్లు చాలా బెదురుగా ఉండేవారని..ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. డిపార్ట్ మెంట్‌లో మహిళలు చాలా క్లియర్‌గా ఉన్నారని అనేకసార్లు డీసీపీ సుమతి చెప్పారు. వ్యభిచారంలో ఉండే మహిళలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులపై ప్రజల అభిప్రాయం ఇప్పుడిప్పుడే మారుతుంది...!
పోలీసులపై ప్రజల ఆలోచనలు మారలేదని..బ్రిటీష్ కాలంలో పోలీసులను ఎలా చూసేవారో..ఇప్పుడు కూడా పోలీసులను ఆ లైన్‌లో చూస్తున్నారనేది సుమతి అభిప్రాయం. కాని..ఇప్పుడిప్పుడే ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు..మహిళలు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారని తెలిపారు . పోలీసులు చట్టం ప్రకారం పని చేస్తున్నారని ప్రజలకు అనిపిస్తే గౌరవిస్తారన్నారు. వృత్తిలో పారదర్శకత అనేది చాలా ముఖ్యమని డీసీపీ సుమతి అభిప్రాయం.
కుటుంబ నేపథ్యం
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ..సుమతిది పక్కా రాయలసీమ. ఆమె మాటల్లో , బాడీ లాంగ్వేజీలో రాయలసీమ కనిపిస్తోంది. కర్నూలుకు 12 కి.మీ దూరంలో సుమతి గ్రామం. మోతుబరి కుటుంబం. కావాల్సినంత పొలం ఉంది. కాని..ఇంట్లో వారికి చదువులేదు. ఆడ పిల్లలకు చదువు కూడా ఉండాలమ్మ అన్న అమ్మ మాటతో బాగా చదువుకోవాలని డిసైడ్ అయ్యారు సుమతి. ఈమె కంటే ముందే చెల్లిలకు పెళ్లేంది. అప్పుడు డీసీపీ సుమతి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్‌లో ఉంది. పట్టుదలతో చదివి ఐపీఎస్ సాధించారు సుమతి.
ప్రేమ వివాహం
డీసీపీ సుమతిది ప్రేమ పెళ్లి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఐపీఎస్ ట్రైనింగ్ కంటే ముందే ఎంగేజ్ అయింది. ట్రైనింగ్‌లో ఉండగా వివాహమైంది. పిల్లలతో హ్యాపీగా ఉన్నామంటారు సుమతి.
సమాజం గురించి
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైంది అంటారు డీసీపీ సుమతి. కుటుంబ, సమాజం నిర్మాణం స్త్రీతోనే జరుగుతుందని చెబుతారు. మా అత్తమామలు నన్నుకూతురు అనుకుంటారని చాలా సందర్భాల్లో సుమతి చెప్పారు. మనుషుల మధ్య నమ్మకమైన ప్రేమ ఉండాలంటారు డీసీపీ సుమతి. పాజిటివ్ గా థింక్ చేయాలని..అనుకున్నది సాధించాలని నేటి తరానికి డీసీపీ సుమతి సూచించారు.