హైదరాబాద్: 23 మంది జర్నలిస్ట్‌లకు కరోనా
By సుభాష్ Published on 15 Jun 2020 6:59 AM GMTతెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ సోకుతున్న ఈ వైరస్ తాజాగా జర్నలిస్టులకు సోకింది. ఇక హైదరాబాద్‌లో అయితే కరోనా పంజా విసురుతోంది. ఆదివారం ఒక్క రోజే 23 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 70కి చేరుకుంది. వరుసగా గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లో పాత సచివాలయం భవన సముదాయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 153 మందికి ఈ పరీక్షలు నిర్వహించగా, ఆదివారం 23 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.
ఇంతకు ముందు మూడు రోజుల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో మరో 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు తేలింది. గతంలో ఇతర ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మంది జర్నలిస్టులకు వ్యాధి సోకింది. దీంతో ఇప్పటి వరకూ కరోనా వ్యాధి బారిన పడ్డ జర్నలిస్టుల సంఖ్య 70కి చేరినట్లు జర్నలిస్టుల సంఘాలు తెలిపాయి. కాగా, ఓ తెలుగు వార్తా చానల్‌లో పని చేసే మనోజ్‌కుమార్ అనే జర్నలిస్టు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజే 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. నమోదైన పాజిటివ్ కేసుల్లో 195 కరోనా కేసులు ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో నమోదు కావడం గమనార్హం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4974 కేసులు నమోదు కాగా, 185 మంది కరోనా బారిన మృత్యువాత పడ్డారు. ఇక 2377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 2412 కేసుల యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
హైదరాబాద్ పరిస్థితి ఏమిటీ..?
ఇక హైదరాబాద్ పరిస్థితిని చూస్తుంటే దారుణంగా మారిపోతోంది. ఎప్పడు ఎక్కడ ఎన్ని కేసులు నమోదు అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ సగటున 100 పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా, లక్‌డౌన్ సడలింపులు, జనాలు ఇష్టం వచ్చినట్లు రోడ్లపైకి రావడం, మాస్కులు ధరించకపోవడం, అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొత్త ప్రాంతాల్లోకూడా కేసులు నమోదు కావడంపై నగరవాసుల్లో భయాందోళన నెలకొంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరిని వదలడం లేదు ఈ కరోనా మహమ్మారి. ఇలాంటి పరిస్థితుళ్లీ లాక్‌డౌన్ అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. ముందున్న లాక్‌డౌన్ కంటే ఈసారి కఠినంగా విధించాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ లాక్ డౌన్ విధిస్తేనే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉదని, లేకపోతే మరింత ప్రమాదం పొంచివుండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లల్లో కూడా మొదట్లో కరోనా కేసులు నమోదైనా .. ఈ మధ్యన తగ్గుముఖం పట్టి, జీహెచ్‌ఎంసీ పరిధిలో విజృంభించింది. ఇక లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.