హైదరాబాద్‌: పదేళ్ల రికార్టును బద్దలు కొట్టింది

By సుభాష్  Published on  12 Oct 2020 2:50 AM GMT
హైదరాబాద్‌: పదేళ్ల రికార్టును బద్దలు కొట్టింది

హైదరాబాద్‌ నగరంలో ఈసారి కురిసిన భారీ వర్షాలకు పదేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అతిభారీ వర్షంతో నగరమంతా తడిసిముద్దయింది. 2010లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈనెల 9న నగరంలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా శేరిలింగంపల్లి, పటాన్‌ చెరులో 6 సెంటీమీర్లపైగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి తోడు ఉత్తర కర్ణాటక, రాయసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణుల కారణంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

2002లో హైదరాబాద్‌ నగరంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో హుస్సేన్‌ సాగర్‌కు వరదనీరు భారీగా వచ్చి పరిసర ప్రాంతాలన్నీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక 2010లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాజాగా ఈ సంవత్సరం 9న ఆసిఫ్‌నగర్‌ మండలం పరిధిలో 15.1 సెం.మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. పదేళ్ల తర్వాత ఇదే రికార్డు స్థాయిలో వర్షపాతంగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం గ్రేటర్‌లో వర్షపాతం భారీగా పెరిగింది. గడిచిన నాలుగైదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సారి వర్షాలు అధికంగా కురిశాయి.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో గడిచిన నాలుగు నెలల్లో సరాసరి 34 శాతం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం జూన్‌, జూలై మాసాల్లో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు మాసంలో మాత్రమే వర్షాలు కురిశాయి. కానీ ఈ సంవత్సరం జూన్‌ మాసం నుంచి వానలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో 30 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39 శాతం, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 33 శాతం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిధిలిస్తే ఈ ఏడాది నాలుగు నెలల్లో 45 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.

మరో మూడు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన రెండు వేర్వేరు ఉపరితల ద్రోణుల ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇదే ప్రభావంతో రాగల మరో మూడు రోజుల్లో నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆదివారం రాత్రి 7 గంటల నుంచి..

కాగా, ఆదివారం రాత్రి 7 గంటల నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి 6.3 సెంటీమీటర్లు, పటాన్‌ చెరు 6.2సెం.మీ, రామచంద్రాపురంలో 5.9 సెం.మీ, కూకట్‌పల్లిలో 5.5 సెం.మీ, చందానగర్‌లో 4.7సెం.మీ, కొండాపూర్‌లో 3.0సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Next Story