బాలికల కిడ్నాప్‌లకు రాజధాని.. మన హైదరాబాద్..!
By న్యూస్‌మీటర్ తెలుగు
బాలికల కిడ్నాప్ హైదరాబాద్ లో ఒక కఠోరమైన నిజం. కిడ్నాప్ ల సంఖ్య పెరుగుతూనే ఉందది. హైదరాబాద్ లో 2017 లో 341 మంది మహిళలు అపహరణకు గురయ్యారు. ఇందులో 135 మంది మైనర్లు. మిగతా వారు మహిళలు. ఇవి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు అందిస్తున్న వివరాలు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇందులో పదిహేను మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఒక వంద మంది మహిళలు మాత్రం సజీవంగానే బయటపడ్డారు.
జాతీయ మహిళా కమీషన్ లో 2017 లోనమోదైన 138 ఫిర్యాదుల్లో 91 శాతం హైదరాబాద్ కి చెందినవే. పోలీసు రికార్డుల ప్రకారం 2017 తో పోలిస్తే మహిళల కిడ్నాప్, అపహరణ కేసులు ఇరవై శాతం పెరిగాయి. ఇదే సమయంలో రేప్ కేసుల సంఖ్య 11 శాతం పెరిగింది. మహిళలపై హింస ఏడు శాతం పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017 లో 1560 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఇందులో 663 మంది మైనర్లు. వీరిలో 1038 మందిని పోలీసులు కాపాడగలిగారు. 2016 లో హైదరాబాద్ నుంచి 264 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారు. రికార్డుల ప్రకారం అస్సాం తరువాత మహిళలపై అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రం తెలంగాణాయే. తెలంగాణలో మహిళలపై క్రైమ్ రేటు 94.7 శాతం ఉంది. దేశం మొత్తం మీద 2017 లో 4778 మంది మహిళలు, 18501 మంది మైనర్లు అపహరణకు గురయ్యారు. వీరిలో 52.6 శాతం మహిళలను, 55.2 శాతం మైనర్లను కాపాడగలిగారు. 134 మందిని వివాహం కోసం అపహరించారు. 2017 లో46408 మంది అపహృత మహిళల ఆచూకీ తెలియకుండా పోయింది. 70686 మంది ని పోలీసులు రక్షించగలిగారు. దాదాపు వెయ్యి మంది అపహృతులు శవాలై తేలారు.
నిర్భయ చట్టం క్రిం ప్రతి రాష్ట్రం లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ ఒకే ఒక ఫ్రీకాలింగ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ తెలంగాణలో ఈ పథకం కోసం గత నాలుగేళ్లుగా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2016-17లో దీనికోసం కేంద్రం 957.15 లక్షలు కేటాయించినా, రాష్ట్రప్రభుత్వం కేవలం 25 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. వన్ స్టాప్ సెంటర్ కోసం కేంద్రం కేటాయించిన 1396.91 కోట్ల నుంచి కేవలం రూ. 138.07 మాత్రమే ఖర్చు చేశారు. 2018-19 లో హైదరాబాద్ కి 8314 లక్షలు కేటాయించారు.