దేశంలో 5వ బిజీ విమానాశ్రయం మన శంషాబాద్ ఎయిర్ పోర్టే!!

By రాణి  Published on  1 Jan 2020 10:49 AM GMT
దేశంలో 5వ బిజీ విమానాశ్రయం మన శంషాబాద్ ఎయిర్ పోర్టే!!

మన శంషాబాద్ ఎయిర్ పోర్టు మహా నగరానికే మణిహారం. ఇప్పుడు ఈ మణిహారానికి మరో పచ్చల పతకాన్ని పొదిగినట్టయింది. శంషాబాద్ విమానాశ్రయం దేశంలోని అయిదో అత్యంత బిజీ ఎయిర్ పోర్టుల్లో ఒకటి. ఏటా ఇరవై లక్షల మంది యాత్రికులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గగన యానం చేస్తారు. రోజుకు 550 విమానాలు మేఘాల్లోకి ఎగురుతాయి. రోజుకు 60,000 మంది యాత్రికులు ప్రయాణిస్తారు. గత నాలుగేళ్లలో ఎయిర్ ట్రాఫిక్ 20 శాతం పెరిగింది.

శంషాబాద్ విమానాశ్రయం తొలి దశ 1.20 కోట్ల మంది యాత్రికులను గమ్యం చేర్చగలదు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశలో 3.40 కోట్ల మంది యాత్రికులు ప్రయాణం చేయగలరు. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయాన్ని 25 ఎయిర్ లైనర్ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో 21 విమాన సంస్థలు విదేశీ సర్వీసులను కూడా నిర్వహిస్తున్నాయి.

శంషాబాద్ విమానాశ్రయం దేశంలోని మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. ఇంతకుముందెన్నడూ లేని అనేక కొత్త కొత్త సదుపాయాలు కూడా షంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా డిజి యాత్ర పథకాన్ని ప్రారంభించింది. ఈ డిజియాత్ర వ్యవస్థ ద్వారా యాత్రికుల ముఖాలను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. వారి ప్రయాణం కూడా ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. తద్వారా నేరగాళ్లను గుర్తించడం జరుగుతుంది. ఇప్పటికే 4000 మంది యాత్రికులు దీనిలో నమోదు చేసుకున్నారు. మరో ఆరువేల మంది దీనిని ఉపయోగించుకుంటున్నారు. గత అక్టోబర్ నుంచి బాడీ స్కానర్లను కూడా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా కారు పార్కింగ్ లో ఫాస్టాగ్ వ్యవస్థ కూడా అమలులోకి వచ్చింది. దీనికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నుంచి సహకారం తీసుకోవడం జరుగుతోంది. ఇలా ఫాస్టాగ్ ను ఉపయోగించే వాహనాలకు ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయడం జరిగింది.

మరో వైపు విమానాశ్రయంలో ఉన్న 8.4 కిమీ పొడవైన మార్గాల్లో ఉన్న 83 ఎకరాల లాండ్ స్కేప్ కు నీరందించే వ్యవస్థను కూడా క్రమబద్ధీకరించడం ద్వారా 35 శాతం నీటిని పొదుపు చేయటం జరుగుతోంది. విమానాశ్రయంలోని కార్గో టర్మినల్ నుంచి 1.35 మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడం జరిగింది. అదే విధంగా వివిధ సరకు రవాణా సర్వీసులు కూడా శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్నాయి.

Next Story