డ్రైవర్ల నిర్లక్ష్యం: ఇద్దరు చిన్నారులు మృతి

By సుభాష్  Published on  1 Oct 2020 3:02 AM GMT
డ్రైవర్ల నిర్లక్ష్యం: ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మూడేళ్ల పాప కాగా, మరొకరు ఆరేళ్ల బాలుడు ఉండటం కలచివేస్తోంది. షాపు వద్ద ఆవరణలో ప్లేట్లను శుభ్రం చేస్తున్న ఆరేళ్ల బాలుడిని పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయు కాగా, వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతారాంబాగ్‌ చౌరస్తాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌, రేణుక దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. శ్రీనివాస్‌ మెకానిక్‌ పని చేస్తుండగా, రెండో కుఆరుడు హర్షవర్ధన్‌ (6) మధ్యాహ్నం సమయంలో తండ్రికి భోజనం తీసుకుని షాపు వద్దకు వచ్చాడు. అనంతరం వారు తిన్న ప్లేట్లను కడుగుతుండగా, అటుగా వచ్చిన మంగళ్‌హాట్‌ పీఎస్‌కు చెందిన పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. వాహనంలో గాలిని నింపిన తర్వాత డ్రైవర్‌ వాహనాన్ని వెనక్కి తీసుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

పాతబస్తీలో..

పాతబస్తీ చంద్రాయణగుట్టలో జరిగిన మరో ఘటనలో మూడేళ్ల చిన్నారి దుర్మారణం పాలైంది. చంద్రాయణగుట్టలోని మిల్లాత్‌ కాలనీలో నివసించే మహ్మద్‌ నూర్‌, జకియాబేగం దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్నకుమార్తె మారియా బేగం (3) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ గేట్‌ తీసుకుని బయటకు రాగా, బస్తీగల్లీలోని వచ్చిన టిప్పర్‌ చిన్నారిని ఢీకొట్టింది. వెంటనే టిప్పర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాపను చికిత్సనిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వేర్వేరు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it