హై'డర్‌'బాద్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 8:13 AM GMT
హైడర్‌బాద్‌..!

విశ్వనగరం మాటలకే పరిమితమైంది. హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తున్నాయిగానే..ఆ మేరకు కనీస సదుపాయాలు నగరంలో కనిపించడంలేదు. రోడ్లు చూస్తే అధ్వానం. డ్రైనేజీలు చూస్తే ఘోరం. డ్రైనేజీల నీరు రోడ్ల మీద పారుతూ కంపుకొడుతున్న పరిస్థితి. ఇక..వాన పడితే చిత్తడే..!. రోడ్లు చెరువులను తలపిస్తాయి. గతుకుల రోడ్లతో వాహనదారులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి. పాలకులు, అధికారులు మాత్రం చేస్తున్నామని చెబుతారే కాని..ఎక్కడా పనులు కనిపించవు.

Image result for hyderabad rain photos

హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకువచ్చేది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఆదిభట్ల...ఎన్నో బహుళ జాతీ సంస్థల ,పెద్ద పెద్ద భవనాలు, వాటిలో క్షణం తీరిక లేకుండా పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. మరెంతో మంది బతకడానికి వచ్చినవారు. కాని..వీరందరూ హైదరాబాద్ మహా నగరంపై సంతృప్తిగా ఉన్నారా?

కొన్నేళ్లుగా హైదరాబాద్‌ అభివృద్ధికి, పెట్టుబడులకు కేరాఫ్‌గా మారింది. ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో కొలువు తీరాయి. విదేశీయులు కూడా వేల మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. భాగ్యనగరానికి హరంగా మెట్రో కూడా పరుగులు పెడుతుంది. అయినా..ఎక్కడో లోపం. చినుకు పడితే చిత్తడి. లోతట్టు ప్రాంతాలు అస్తవ్యస్తం. నాలాలు పొంగిపొర్లి ఇళ్లల్లోకి పోతున్నాయి. చెరువులు ఆక్రమణతో వర్షం నీరు పోవడానికి దారి లేక అపార్ట్‌మెంట్‌ల్లోకి పోతున్నాయి. ఇలా అయితే..విశ్వనగరం సాధ్యమా?

Image result for hyderabad rain photos

ఒక మోస్తరు వాన వస్తే చాలు, ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు హైదరాబాద్ వాసులు. కారణం.. రోడ్లపై మోకాలి లోతు నీరు, పెద్ద పెద్ద గుంతలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్. ఎన్నో సంవత్సరాల నుంచీ ఇదే పరిస్థితి. పరిస్థితి క్షీణిస్తుందే కాని..మెరుగు పడటంలేదు.

ఎంత ప్రగతి సాధించినా వానాకాలం వస్తోందంటేనే హైదరాబాదీల్లో గుబులు మొదలవుతుంది. రోడ్లపై ఎక్కడ చూసినా నీరు. ఎక్కడెక్కడి చెత్తా ఇంటి ముందు ప్రత్యక్షం . దోమలూ, రోగాలూ కుటుంబసభ్యులను పలకరిస్తుంటే ఆసుపత్రుల్లో బారులు తీరిన జనాన్ని చూసి నిట్టుర్చడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.

ఎవరిదీ నిర్లక్ష్యం?? అసలు ఎందుకీ నిర్లక్ష్యం ??

ఆగస్టు వస్తే వర్షాలు వస్తాయని తెలుసు, మురుగు నిండుతుందనీ తెలుసు. అయినా నాలాలు, డ్రైనేజీలు బాగు చేయరు. రోడ్లపై గుంతలు ఉన్నాయనీ తెలుసు, వానలొస్తే వాహనదారులకు ఇబ్బంది అని తెలుసు వాటి గురించి పట్టించుకోరు. దోమలు రాకుండా చెత్తను తొలగించాలనీ తెలుసు కానీ అదీ జరగదు. ప్రభుత్వాలు, అధికారులు తెలిసి తప్పులు చేస్తున్నారని హైదరాబాదీలు విమర్శిస్తున్నారు. ఎడతెరిపిలేని వానలు, అధ్వానమైన రోడ్లు హైదరాబాద్ అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి.

Image result for hyderabad rain photos

అభివృద్ధి ఉండాలి కాని..ఆ అభివృద్ధిని ఆస్వాదించే మంచి వాతావరణం కూడా ఉండాలి .

ప్రభుత్వం , అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.

Next Story