హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన అధ్యయన కమిటీ కేసీఆర్‌కు నివేదిక అందించింది. సీఎం కేసీఆర్‌ కార్మికులతో చర్చలకు ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం శనివారం చర్చలు జరిపే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు బస్‌ భవన్‌లో చర్చలు జరగనున్నాయి. ఆర్థికపరమైన 12 అంశాలపై చర్చించే అవకాశముంది. హైకోర్టు ఆదేశాలమేరకు.. విలీనం మినహా 21 డిమాండ్ల సాధ్యసాధ్యాలపై మూడు రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ఆరుగురుతో కమిటీ వేశారు. అధ్యయన కమిటీ రెండు రకాల నివేదికలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నివేదికను 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. ఆర్టీసీకి అద్దె బస్సుల అవసరంపై కూడా కమిటీ సభ్యులు మరో నివేదికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

శనివారం హుజూర్ నగర్ లో కేసీఆర్ ‘ప్రజా కృతజ్ఞత సభ’

సూర్యాపేట: హుజూర్‌నగర్ లో శనివారం జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా కృతజ్ఞత సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరిగే సభ హుజూర్‌ నగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు . హుజూర్ నగర్ విజయం మరిచిపోలేనిదన్నారు. సభ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి , సైది రెడ్డి పరిశీలించారు.

శనివారం జరిగే సభలో సీఎం కేసీఆర్‌ హుజూర్ నగర్ ప్రజలకు వరాలు కురిపిస్తారని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ పై నమ్మకంతో సైదిరెడ్డిను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హుజూర్‌నగర్ ప్రజలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత పట్టుదలతో పనిచేస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఈ ప్రాంత అభివృద్ధిపై చేపట్టే పనులను సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన నోటితో చెబుతారని టీఆర్‌ఎస్ నేతలు చెప్పారు. లక్ష మంది సభకు హాజరవుతారని చెప్పారు.రోడ్ మార్గం ద్వారా సీఎం కేసీఆర్‌ హుజూర్ నగర్ వస్తారని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.