జాతీయ గీతాన్ని పాడిన..ఈ బుడతడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే..!
By న్యూస్‌మీటర్ తెలుగు
హ్యూస్టన్: స్పర్ష్ షా.. విరిగిన ఎముకలతో జన్మించాడు. ఆస్టియోజెనెసిస్ ఇంపర్ ఫెక్టా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడు. అంటే శరీరంలోని ఎముకలు జీవితాంతం విరుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకూ సుమారుగా 140చోట్ల ఎముకలు విరిగాయి. కొంచెం గట్టిగా చెయ్యి పట్టుకుంటేనే అతని ఎముకలు విరిగిపోతాయి. కాళ్లూ, చేతుల పైన కొద్దిపాటి బరువు కూడా మోయలేడు. మామూలు పిల్లల్లా నడవలేడు, పరిగెత్తలేడు.
అయినా.. ఆత్మైస్థెర్యం కోల్పోకుండా తనకు ఇష్టమైన పాటలను పాడుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో అతడి పాటలు, మాటలు ఎందరికో స్ఫూర్తి నింపాయి. నాట్ అఫ్రైడ్ అంటూ 2016లో ఆ బాలుడు విడుదల చేసిన వీడియో అల్బమ్ వైరల్ అయింది. దాదాపు ఆరు కోట్ల మంది దీనిని వీక్షించారు.
రాగ ర్యాప్ అనే సరికొత్త బాణిని సృష్టించాడు స్పర్ష్. ఇప్పటి వరకు అనేక సంగీత కచేరీ ఇచ్చాడు. కచేరీలతో బాలుడు 50లక్షల డాలర్లను సంపాదించాడు. వాటితో వైద్యం చేయించుకుంటూ సంగీత సాధన సాగిస్తున్నాడు. అమెరికా, భారత సంగీతాన్ని అవపోసనపట్టిన స్పర్ష్ షా.. తన పేరును ప్యూరిథమ్‌గా మార్చుకున్నాడు.
ఆదివారం హ్యూస్టన్ లో జరిగిన 'హౌడీ మోడి ' కార్యక్రమంలో భారత ప్రధాని మోడి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. సుమారు 50 వేల మంది ప్రవాస భారతీయులూ పాల్గొన్నారు. వీరందరీ ముందు భారత జాతీయ గీతాన్ని పాడే అవకాశం షాకు వచ్చింది. చిన్న అవయవ లోపం ఉన్నా కుంగిపోతుంటారు కొంత మంది యువతి, యువకులు. అటువంటి వారిలో మనోధైర్యం నింపుతున్నాడు షా.