ఉండేది హుస్సేన్ సాగర్ ఒడ్డున ఒక చిన్న గుడారంలాంటి గుడిసెలో… ఒక చిన్న లాగూ తప్ప ఒంటి మీద ఏమీ ఉండదు. ఒంటిమీద గాయాల మచ్చలుంటాయి. ఛాతీ, ఎడమ భుజం మీద రాడ్ గుచ్చుకుపోయిన మచ్చ ఇంకా అలాగే ఉంది. కాలిలో లోపలిదాకా గుచ్చుకుపోయిన మేకు వల్ల అయిన పుండు తాలూకు మచ్చ కూడా ఇంకా పోలేదు. కానీ శివ అనే ఆ యువకుడు ప్రాణదాత. జలసమాధి అయిపోతున్నవారిని బయటకు తెచ్చి, మరో జన్మనిచ్చే వ్యక్తి. నిజం… ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఈ “శివా”జ్ఞ నుంచి తప్పించుకోలేరు.

హుస్సేన్ సాగర్ చుట్టూ పగలూ రేయీ తన వాహనంలో గస్తీ తిరిగే ఈ శివ అనే  యువకుడు ఇప్పటి వరకూ 110 మంది ప్రాణాలను కాపాడాడు. వీరంతా ఆత్మహత్య చేసుకునేందుకు హుసేన్ సాగర్ లోకి దూకిన వారే. కానీ వీరిని వెన్నంటి శివ కూడా నీటిలోకి దూకుతాడు. ప్రజలను ఒడ్డుకు చేరుస్తాడు. ఇవే కాక చనిపోయిన వేలాది మంది శవాలను బయటకు తీస్తాడు.

సరిగ్గా వారం కిందే ఒక వ్యక్తి చావాలనుకుని నీటిలోకి దూకాడు. బీటు కానిస్టేబుల్ అది చూసి నీటిలోకి దూకి అతడిని కాపాడేందుకు యత్నించాడు. కానీ అతనూ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఇద్దరినీ కాపాడేందుకు శివ నీటిలోకి దూకాల్సి వచ్చింది. ఇద్దరి ప్రాణాలనూ అతను కాపాడాడు. గతేడాది ఆయన సంపన్న కుటుంబానికి చెందిన ఒక 90 ఏళ్ల పండు ముదుసలిని కాపాడాడు. ఆమె తన సంతానానికి భారం కాకూడదని హుసేన్ సాగర్ లోకి దూకింది.  ఆమెను శివ బయటకు తీసుకొచ్చాడు. ఒక సారి ఒక వ్యక్తికి కాపాడే ప్రయత్నంలో హుసేన్ సాగర్ లోని ఒక ఇనుప రాడ్ అతని ఛాతీ లోకి, ఎడమ భుజంలోని దూసుకుపోయింది. వ్యక్తిని కాపాడిన తరువాత ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. మరో సారి ఇలాంటి ప్రయత్నంలోనూ పెద్ద మేకు కాలిలోకి దిగింది. ఈ సంఘటన తెల్లవారు జాము రెండు గంటలకు జరిగింది.

ఒక దాత ఒక లూనాను కొనిచ్చాడు. దానితోనే శివ గస్తీ తిరుగుతూంటాడు. ఇంకో మంచిమనసున్న మనిషి ఇతనికి నెలకు అయిదువేలు ఇస్తూంటాడు. దానితోనే శివ, అతని భార్య, బిడ్డ కాలం గడుపుతూంటారు. ఇంత మందిని కాపాడిన శివ జీవితంలోనూ ఒక చెప్పుకోలేని విషాదం ఉంది. ఇతని తమ్ముడు పవన్ ఇదే హుస్సేన్ సాగర్ లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.